ఒక్క అవకాశం ఇవ్వండి.. అలా చేయకుంటే తరిమికొట్టండి: కేజ్రీవాల్

1 May, 2022 18:19 IST|Sakshi

పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న‌ విజయం సాధించి ఫుల్‌ జోష్‌ మీదున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రస్తుతం గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌లపై ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త అర‌వింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. బరూచ్‌లో జరిగిన ఆదివాసీ సంకల్ప్ మహా సమ్మేళనంలో మాట్లాడుతూ.. ఒక్కసారి తమకు పాలించే అధికారాన్ని ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజలను కోరారు.

గుజరాత్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. రాష్ట్రంలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతడ్డాయని, మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయన్నారు. లక్షలాది మంది చిన్నారుల భవిష్యత్తు అస్తవ్యవస్తమైందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము ఢిల్లీలో పాఠశాలలను మార్చిన విధంగా గుజరాత్‌లో పిల్లల భవిష్యత్తును మార్చగలమని హామీ ఇచ్చారు. ఢిల్లీలో 4 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వం పాఠశాలలకు మారారని తెలిపారు. ధనవంతుల, పేద పిల్లలు కలిసి చదువుకుంటున్నారని, రాష్ట్రంలో ఈసారి 99.7% ఉత్తీర్ణత నమోదైందన్నారు.

అదే విధంగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు కూడా అరవింద్‌ కేజ్రీవాల్‌ సవాలు విసిరారు. గుజరాత్‌లో పరీక్షల సమయంలో ప్రశ్నా పత్రాల లీక్‌ విషయంలో బీజేపీ ప్రపంచ రికార్డు సృష్టిస్తోందని విమర్శించారు. పేపర్‌ లీక్‌ కాకుండా ఒక్క పరీక్ష అయినా నిర్వహించాలని  భూపేంద్ర పటేల్‌కు సవాల్‌ విసిరారు. గుజరాత్‌ బీజేపీ దురహంకారాన్ని బద్దలు కొట్టేందుకు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఒకవేళ పాఠశాలలను మెరుగుపరచకపోతే తరిమికొట్టండి అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. 
చదవండి: ఎండలు తగ్గేదేలే.. ఏకంగా 122 ఏళ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు

కాగా వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. గుజరాత్‌ అసెంబ్లీని రద్దుచేసి బీజేపీ ముందస్తు ఎన్నికలకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంద‌ని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తమ పార్టీని చూసి బీజేపీ భయపడిపోతుందని ఎద్దేవా చేశారు. అయితే ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఆప్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు