ఫ్రీ కరెంట్‌ పేటెంట్‌ మాదే.. ధరణి కంటే మంచి పోర్టల్‌ తెస్తాం: రేవంత్‌రెడ్డి

11 Nov, 2023 15:13 IST|Sakshi

సాక్షి, బెల్లంపల్లి:  తెలంగాణలో రాబోయే రోజుల్లో  కాంగ్రెస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ..  అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరతామని అన్నారు. బెల్లంపల్లిలో శనివారం జరిగిన కాంగ్రస్‌ విజయభేరి ఎన్నికల ప్రచార సభలో ఆయన బీఆర్‌ఎస్‌ నేతలపై విరుచుకుపడ్డారు.

‘‘దేశంలో గాంధీ కుటుంబంలా.. తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులు. ఇటు బెల్లంపల్లిలో అటు చెన్నూరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ మేడిగడ్డకు తీసుకెళ్లారు. మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం మిగిలిపోయింది. సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వాన వస్తేనే కుంగిపోయింది. అంత పెద్ద ప్రాజెక్టును ఇసుక మీద ఎవరైనా కడతారా?. అదేమైనా పేక మేడనా?.. ఇసుకపై బ్యారేజీ కడితే అది కుంగిపోయింది. మేడిగడ్డ అణా పైసాకు పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదు.

.. బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య దుర్మార్గాల గురించి రాష్ట్రమే కాదు... దేశమంతా తెలుసు. అలాంటి దుర్మార్గుడిని గెలిపించాలని కేసీఆర్ చెబుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..?, సింగరేణి ఉద్యోగాలు, భూములు అమ్ముకోలేదా?. అలాంటి వారినా కేసీఆర్ గెలిపించాలనేది’’ అని రేవంత్‌ ఆరోపించారు. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ ఆత్మగౌరవం పెరగాలంటే గడ్డం వినోద్, వివేక్‌లను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటున్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి తీరుతాం. ధరణి తీసేస్తే రైతు బంధు రాదని కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ధరణి రాకముందు 2018లో రైతు బంధు ఎలా ఇచ్చారు?, ధరణికంటే మెరుగైన సాంకేతికతతో పోర్టల్‌ తీసుకొస్తాం.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతీ ఎకరానికి ఏటా రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. మాట తప్పని, మడమ తిప్పని ఉక్కు మహిళ సోనియా. ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారు.’’ అని రేవంత్ వివరించారు.

సింగరేణి కార్మికుల్ని కేసీఆర్‌ మోసం చేశారు
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొన్నారని.. కానీ, వాళ్లను కూడా కేసీఆర్‌ మోసం చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. రామగుండం కాంగ్రెస్‌ విజయభేరి యాత్ర సభలో రేవంత్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు అంతా పాల్గొన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని ఎందుకు క్రమబద్దీకరించలేదు.  ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ ఎందుకు బంద్‌ కాలేదు?. సింగరేణి సొంతింటి కల నెరవేరిందా?.  కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం’’ అని అన్నారాయన. 

మరిన్ని వార్తలు