జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.. బిహార్‌ ఎమ్మెల్యేలు వచ్చారు

5 Feb, 2024 01:30 IST|Sakshi
ఆదివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బిహార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

రాంచీ వెళ్లిపోయిన జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌కు చేరుకున్న బిహార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..

ఆ రాష్ట్రంలో బలపరీక్ష రోజుఘావరకు ఇక్కడే 20 మంది మకాం 

సాక్షి, హైదరాబాద్‌: జార్ఖండ్‌ రాజకీయం అయిపోగానే తెలంగాణలో బిహార్‌ రాజకీయం ప్రారంభమయింది. 3 రోజుల క్రితం రాంచీ నుంచి వచ్చిన జేఎంఎం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోగానే, బిహార్‌కు చెందిన 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో చంపయీ సొరేన్‌ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

చంపయీ సొరేన్‌ బలనిరూపణకు సోమ వారం వరకు గడువు ఉండడంతో జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ శివార్లలోని శామీర్‌పేటలో ఉన్న ఓ రిసార్టుకు తీసుకువచ్చారు. శుక్ర, శని,ఆదివారం ఉదయం వరకు అక్కడే ఉన్న జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లిపోయారు. వారు అటు వెళ్లిపోగానే బిహార్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పట్నా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

సాయంత్రం 5 గంటలకు వచ్చిన వారికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్, టీపీసీసీ ప్రొటోకాల్‌ చైర్మన్‌ హర్కర వేణుగోపాల్, సీనియర్‌ నేత మల్‌రెడ్డి రాంరెడ్డిలు ఎయిర్‌పోర్టులో ఆహ్వానం పలికారు. వారిని అక్కడి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్‌కు తరలించారు. ఈనెల 10వ తేదీన బిహార్‌లో నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోనుండటంతో అప్పటివరకు వీరంతా రిసార్ట్‌లోనే ఉంటారని గాం«దీభవన్‌ వర్గాల ద్వారా తెలిసింది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega