Sakshi News home page

పల్లె కడుపున రాచపుండు!

Published Mon, Feb 5 2024 4:39 AM

Cancer is affecting Maddikunta of Kamareddy district - Sakshi

సాక్షి, కామారెడ్డి:  కేన్సర్‌ వ్యాధి రాచపుండులా మా రి పల్లెల్ని వణికిస్తోంది. ఏమవుతోందో తెలుసుకు నే లోపే ప్రాణాలను కబళిస్తోంది. కుటుంబాలను వీధిపాలు చేస్తోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం కొన్నాళ్లుగా కేన్సర్‌ తో  అల్లాడుతోంది. గత మూడేళ్లలోనే ఇక్కడ పన్నె ండు మంది కేన్సర్‌తో చనిపోయారని.. మరో పది మందికిపైగా చికిత్స పొందుతున్నారని గ్రామ స్తులు చెప్తున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిసంఖ్య మరింతగా పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. కొందరు బాధితులు మానసికంగా, శారీరకంగా దెబ్బతిని జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా కేన్సర్‌ బారినపడుతున్నారు. ఒక్క ఊరిలోనే ఇంతమంది కేన్సర్‌ బాధితులు ఉండటం ఆందోళన రేపుతోంది. 

వరుసగా మరణాలతో కలవరం 
మద్దికుంట గ్రామానికి చెందిన భారతి అనే మహిళ మూడేళ్ల కింద కేన్సర్‌ బారినపడి చికిత్స పొందుతూ మృతిచెందింది. తర్వాత ప్రమీల, లక్ష్మి, భూమవ్వ, భాగ్య, రాజవ్వ.. ఇలా మూడేళ్లలో పది మందికిపైగా కేన్సర్‌ బారినపడి చికిత్స పొందుతూ చనిపోయారు. వీరిలో కొందరు రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) కేన్సర్‌తో చనిపోయినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. ఐదారుగురు మగవారు ఊపిరితిత్తుల (లంగ్స్‌) కేన్సర్, నోటి కేన్సర్లతో మరణించారు.

మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఓ మహిళకు రొమ్ము కేన్సర్‌ సమస్య తీవ్రం కావడంతో వైద్యులు ఆపరేషన్‌ చేసి ఆ భాగాన్ని తొలగించారు. మరో మహిళ ఇదే సమస్యతో చికిత్స పొందుతోంది. ఇంకో ఇద్దరు మహిళలు సర్వైకల్‌ కేన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే పొరుగువారు, గ్రామస్తులు ఎలా స్పందిస్తారో, తమను ఎక్కడ దూరం పెడతారోనన్న ఆందోళనతో బాధితులు తాము కేన్సర్‌ బారినపడ్డ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. 

గ్రామస్తుల్లో ఆందోళన 
ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు అప్పటి కలెక్టర్‌ యోగితారాణా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మహిళలకు సర్వైకల్‌ కేన్సర్‌ పరీక్షలు చేయించారు. పదుల సంఖ్యలో బాధితులను గుర్తించారు. చాలా మందికి ఇది ప్రారంభ దశలోనే ఉండటంతో వైద్యం అందించారు. పరీక్షలు చేయించుకోనివారు, చేయించుకున్నా బయటికి చెప్పకుండా ఏవో మందులు వాడుతున్నవారు తర్వాత ఇబ్బందిపడుతున్నారు. ఇలా మద్దికుంటలో ఎక్కువ మంది బాధితులు కనిపిస్తున్నారు. తరచూ గ్రామంలో ఎవరో ఒకరు పెద్దాస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవడం, వారిలో కొందరు చనిపోతుండటం చూసి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసి పరీక్షించాలని.. బాధితులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు. 

ఎంతో అవస్థ పడి కోలుకుంటున్నా.. 
ఏడాది కింద కడుపులో నొప్పి మొదలైంది. ఆర్‌ఎంపీ వద్ద చూపించుకుని, మందులు వాడినా తగ్గలేదు. కామారెడ్డిలోని ఆస్పత్రికి వెళ్తే.. స్కానింగ్‌ చేసి కడుపులో కేన్సర్‌ సమస్య ఉందని చెప్పి హైదరాబాద్‌కు పంపించారు. బసవతారకం ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాను. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేసి గడ్డను తొలగించారు. మొన్నటి దాకా కెమో థెరపీ చేశారు. ఏడాది పాటు ఎంతో అవస్థ పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. పరీక్షలు, మందులు, రాకపోకలకు రూ.2 లక్షల దాకా ఖర్చయ్యాయి. – కుమ్మరి లత, మద్దికుంట, కామారెడ్డి జిల్లా 

కేన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నాం 
నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) గురించి అవగాహన కల్పించేందుకు తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఆయా వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉందని తెలిస్తే తగిన వైద్యసేవలు అందిస్తున్నాం. ఇటీవల దోమకొండ, భిక్కనూరులలో క్యాంపులు నిర్వహించాం. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పాలియేటివ్‌ థెరపీ ఏర్పాటు చేశాం. ఆరు బెడ్లతో సేవలు అందిస్తున్నాం. మద్దికుంటకు సంబంధించిన కేసులను పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, కామారెడ్డి 

Advertisement
Advertisement