Munugode Bypoll 2022: కథ.. స్క్రీన్‌ ప్లే.. డైరెక్షన్‌ కేసీఆరే.. ఓటమి భయంతోనే ఈ స్కెచ్‌

27 Oct, 2022 02:31 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపణ

మునుగోడులో ఓటమి భయంతోనే ఈ స్కెచ్‌

సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి చేసిన కుట్ర ఇది

రెండు టీవీ చానెళ్లతో కలిసి ఈ నీచానికి పాల్పడ్డారు... కేసీఆర్‌కు దమ్ముంటే సీసీ కెమెరాల ఫుటేజీలన్నీ బయటపెట్టాలి

యాదాద్రి స్వామి వద్ద ప్రమాణం చేద్దాం

మర్రిగూడ:  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే పేరిట జరిగిన డ్రామా వెనుక కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేల నెత్తిపై రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా కొనేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, వాళ్లను కొనాల్సిన ఖర్మ బీజేపీకి కూడా లేదని సంజయ్‌ అన్నారు. మునుగోడులో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని తేలిందని, కొడుకు, అల్లుడు సహా అంతా ఇక్కడే తిష్టవేసినా లాభం లేకపోవడంతో కేసీఆర్‌ ఈ కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు.

భవిష్యత్తులో పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవడానికి కూడా ఈ స్కెచ్‌ వేశారన్నారు. బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా మర్రిగూడ తిరగండ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని తెలియడంతో బీజేపీని బదనాం చేసేందుకు రెండు టీవీ ఛానళ్లతో కలిసి కేసీఆర్‌ ఇలాంటి నీచమైన డ్రామాకు తెరదీశారని అన్నారు.

కేసీఆర్‌కు దమ్ముంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఫామ్‌హౌస్‌తో పాటు హోటల్, ప్రగతి భవన్‌లోని గత నాలుగు రోజుల సీసీ కెమెరా ఫుటేజీలన్నీ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయమై తనతోపాటు బీజేపీ నేతలంతా యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ డ్రామాలో పాత్ర లేదని కేసీఆర్‌... భార్యాపిల్లలతో కలిసి యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు. టైమ్, డేట్‌ ఫిక్స్‌ చేస్తే తామంతా అక్కడికి వస్తామన్నారు.  

డ్రామాలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర 
స్వామిజీలను కేసులో ఇరికిస్తారా? హిందూ ధర్మ మంటే అంత చులకనా అని సంజయ్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి చేసిన కుట్ర ఇదని, అక్కడికి స్వామిజీలను పిలిపించుకుని ఈ స్టోరీ ప్లాన్‌ చేశారని ఆరోపించారు. అదంతా దక్కన్‌ కిచెన్‌ హోటల్‌లో జరిగిందంటున్నారు కదా.. ఆ హోటల్‌కు సంబంధించిన గత 4 రోజుల కెమెరా ఫుటేజీని పూర్తిగా విడుదల చేసే దమ్ముందా? అన్ని ప్రశ్నించారు.

అలాగే ప్రగతి భవన్‌ సీసీ కెమెరా ఫుటేజీలన్నీ విడుదల చేయాలన్నారు. ఈ డ్రామాలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉందని, గతంలోనూ ఓ మంత్రి తనపై హత్యాయత్నం చేసినట్లు డ్రామా చేయించడంలో ఈ పోలీస్‌ ఆఫీసరే అత్యుత్సాహం చూపారన్నారు. ఈ డ్రామాకు తెరదీసిన టీఆర్‌ఎస్‌ను రాజకీయ సమాధి చేయడంతో పాటు దీని వెనుక ఉన్న పోలీసుల అంతు చూస్తామని అన్నారు.  

వారి కాల్‌లిస్ట్‌ బయట పెట్టండి 
పట్టుపడిన స్వామీజీ ఇటీవల పరిగి సమీపంలో పూజలు చేశారని, అక్కడ ఎవరెవరిని కలిశారో బయట పెట్టాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. వాళ్ల ఫామ్‌హౌస్‌కు వాళ్లే వెళ్లడం, వాళ్లే పోలీసులకు ఫోన్‌ చేయడం, తమను కాపాడాలనడం, 3 గంటలు అక్కడే ఎదురు చూడటం.. ఇదంతా చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. కేసీఆర్‌ చేతిలోనే అధికారం ఉన్నందున దమ్ముంటే ఎమ్మెల్యేలు, స్వామిజీల కాల్‌ లిస్ట్‌ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

రూ. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా బయట పెట్టాలన్నారు. గతంలో బెంగళూరులో బేరసారాలు జరిగినట్లు వార్తలొచ్చాయని, అవన్నీ బయటపెట్టాల్సిందేనన్నారు.  ఫామ్‌హౌస్‌ నుంచి ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌కు ఎలా వెళ్తారని, వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తే నిజాలు తెలుస్తాయని సంజయ్‌ పేర్కొన్నారు. ఆధారాల్లేకుండా పోలీసులు ఇలాంటి డ్రామాలు చేస్తే ప్రజలు, కార్యకర్తలు ఉరికించి ఉరికించి కొడతారని అన్నారు.    

మరిన్ని వార్తలు