జైల్లో కూడా కేజ్రీవాల్ విపాస‌న చేయ‌వచ్చు: బీజేపీ సెటైర్లు

21 Dec, 2023 15:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ విపాసన ధ్యానం కోర్సులో చేరిన విషయం తెలిసిందే. పది రోజులపాటు కొనసాగనున్న ఈ ధ్యానం కోర్సు కోసం బుధవారమే కేజ్రీవాల్‌ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు వెళ్లారు. అయితే ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకల కేసులో విచారణకు రావాలని ఈడీ రెండోసారి సమన్లు జారీ చేసింది. దీని ప్రకారం నేడు(గురువారం) ఈడీ ఎదుట కేజ్రీవాల్‌ హాజరు కావాల్సి ఉంది. కానీ విచారణకు డుమ్మా కొట్టి ధ్యాన శిబిరానికి వెళ్లారు. 

ఈ క్రమంలో కేజ్రీవాల్‌ విపాసన ధ్యానపై బీజేపీ గురువారం తీవ్ర‌స్ధాయిలో మండిపడింది. జ‌వాబుదారీత‌నం, అర‌వింద్ కేజ్రీవాల్ ఒకచోట ఉండలేవని విమర్శలు గుప్పించింది.. ఈడీ సమన్లను భేఖాతరు చేయడంపై  బీజేపీ నేత సంబిట్ పాత్ర స్పందిస్తూ.. కేజ్రీవాల్‌, క‌ర్త్య‌వ్యం ఎన్న‌డూ క‌లిసి ప‌నిచేయలేవ‌ని పేర్కొన్నారు. విపాసన పేరును అడ్డుపెట్టుకొని  దాక్కుంటున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ జైల్లో విపాస‌న చేయ‌గ‌ల‌ర‌ని వ్యాఖ్యానించారు. 

కాగా మ‌ద్యం కుంభ‌కోణానికి సంబంధించిన మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఈడీ త‌న‌కు స‌మ‌న్లు జారీ చేయ‌డాన్ని కేజ్రీవాల్ స‌వాల్ చేసిన అనంత‌రం బీజేపీ నేత ఈ వ్యాఖ్య‌లు చేశారు. లిక్క‌ర్ స్కామ్ కేసులో ఈడీ రెండోసారి స‌మ‌న్లు జారీ చేయడంపై కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ మేరకు ఆరుపేజీల లేఖ రాశారు. ఇక ఈడీ త‌న‌కు పంపిన స‌మ‌న్లు అక్ర‌మ‌మ‌ని, రాజ‌కీయ దురుద్దేశంతో కూడిన‌వ‌ని కేజ్రీవాల్ అభివ‌ర్ణించారు.

తాను ఎలాంటి స‌మ‌న్ల‌నైనా స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, గ‌త స‌మ‌న్ల త‌ర‌హాలో తాజా ఈడీ స‌మ‌న్లు కూడా రాజ‌కీయ దురుద్దేశంతో కూడిన‌వ‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. స‌మ‌న్‌ను ఉప‌సంహ‌రించాల‌ని, తాను నిజాయితీ, పార‌ద‌ర్శ‌క‌తో కూడిన జీవితం గ‌డిపాన‌ని, త‌న‌వ‌ద్ద దాచేందుకు ఏమీ లేద‌ని ఢిల్లీ సీఎం వెల్ల‌డించారు.
చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం

>
మరిన్ని వార్తలు