‘ఇండియా కూటమి ఎక్కడ? అందరూ వెళ్లిపోతున్నారు’

27 Jan, 2024 17:49 IST|Sakshi

ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో ఒక్కొక్కరుగా తమ పార్టీలు వైదొలుగుతన్నట్లు ప్రకటించటం వల్ల కాంగ్రెస్‌ ఢీలా పడిపోతుంది. ఇదే సమయంలో ఇండియా కూటమిపై బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రతిపక్షాల  ‘ఇండియా  కూటమి’ ఎక్కడ ఉందని బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌ ప్రశ్నించారు. బెంగాల్‌లో టీఎంసీ, పంజాబ్‌లో ఆప్‌.. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తామన్న విషయం తెలిసిందే. మరోవైపు బిహార్‌లో కూడా నితీష్‌ కుమార్‌ ‘ఇండియా కూటమి’కి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరి మళ్లీ సీఎం అవుతారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ  నేపథ్యంలో ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’పై బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇండియా కూటమి ’ అనేది దేశంలోని ఓటర్లలో అపనమ్మకాలను సృష్టించి.. వారిని మోసం చేయడానికే ఏర్పాటు చేశారని మండిపడ్డారు. దేశంలో కూటమి కనిపించటం లేదన్నారు. ‘అసలు కూటమి అనేదే లేదు. అందులో ఉండే భాగస్వామ్య పార్టీలు బయటకు వెళ్తున్నాయి. బెంగాల్‌లో ఇండియా కూటమి లేదు. ప్రజలు, ఓటర్లను మోసం చేయడానికి ప్రతిపక్షాలు ఈ కూటమిని ఏర్పాటు చేశారు. చివరికి సీపీఐ(ఎం) కూడా కూటమిలో లేమని ప్రకటించింది’ అని ఎంపీ దిలీప్‌ ఘోష్‌ మండిపడ్డారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ మొత్తం ఒక్క సీటు కూడా గెవలకుండా తుడిచిపెట్టుకుపోతుందని  అన్నారు. ఇక.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈసారి సగం కంటే తక్కువ సీట్లకే పరిమితం కానుందని తెలిపారు. బిహార్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై దిలీప్‌ ఘోష్‌ స్పందిస్తూ.. అక్కడ విడిగా పోటీ చేయలేరు.. అలా అని కలిసి పోటీ చేయలేని పరిస్థితి ఉందని కూటమి పార్టీలపై విమర్శలు గుప్పించారు. 

చదవండి: కేరళ గవర్నర్‌కు జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత పెంపు.. ఎందుకంటే?


 

whatsapp channel

మరిన్ని వార్తలు