కాంగ్రెస్‌ను బద్నాం చేసే కుట్ర 

14 Nov, 2023 01:31 IST|Sakshi

బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ యత్నాలు: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ 

మాకు సంబంధం లేకున్నా దాడుల విషయంలో నిందలు మోపుతున్నారు 

తప్పుడు ప్రకటనలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలపై ఈసీ చర్యలు తీసుకోవాలి 

మోదీ మరోమారు మాదిగలను మోసం చేశారు 

మోదీ, అమిత్‌షా సన్నిహితుడికి అసద్‌ తన ఇంట్లో పార్టీ ఇచ్చారు 

దీనిపై మక్కామసీదులో ప్రమాణానికి నేను సిద్ధం.. అసద్‌ వస్తారా అని సవాల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ను బద్నాం చేసేందుకు బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే బీఆర్‌ఎస్‌ నేతలపై జరిగే దాడులతో కాంగ్రెస్‌కు సంబంధం లేకపోయినా తమకు అంటగట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి ఘటనలో కాంగ్రెస్‌ ప్రమేయం ఉందని కేసీఆర్‌ కుటుంబమంతా ప్రచారం చేసిందని, కానీ ఆ దాడిలో కుట్ర కోణం లేదని, సంచలనం కోసమే నిందితుడు దాడి చేశాడని పోలీసులు చెప్పారన్నారు.

ఈ కేసులో ఇంతవరకు రిమాండ్‌ రిపోర్టు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి ఘటనను కూడా రాజకీయం చేస్తున్నారని, పరామర్శ పేరుతో మంత్రి కేటీఆర్‌ కొత్త డ్రామాకు తెరతీశారని వ్యాఖ్యానించారు. మరో 15 రోజుల్లో ఇలాంటి దాడులు ఇంకా జరుగుతాయని కేటీఆర్‌ చెప్పడాన్ని, తమ ఫోన్‌లను హ్యాకింగ్‌ చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉండటం తగదని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రేవంత్‌ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, కొండ్రు పుష్పలీల తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక నుంచి కూలీలను తెచ్చి కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేయాలని చూస్తే ప్రజలు తిప్పికొట్టారని, దీంతో అక్కడ బీజేపీకి మద్దతిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను తెలంగాణలోనూ ప్రసారం చేయాలని హరీశ్‌రావు మీడియాకు ఫోన్లు ఎందుకు చేశారని నిలదీశారు. బీజేపీతో పొత్తులో ఉన్న కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను హరీశ్‌ సమన్వయం చేయడం దేనికి సంకేతమన్నారు. మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయడానికి బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం,జేడీఎస్‌ పార్టీల దుష్టచతుష్టయం కుట్ర చేస్తోందని ఆరోపించారు.  

బిల్లు పెడితే మేం మద్దతిస్తాం 
తాము మైనార్టీలకు మేలు చేస్తామని డిక్లరేషన్‌ ప్రకటిస్తే మైనార్టీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్‌ తప్పుడు ప్రయత్నం చేస్తున్నారని, మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టి అపోహలు సృష్టిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. ఎస్సీల వర్గీకరణపై కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వేసిన కమిటీలు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయని, డిసెంబర్‌ 4 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెడితే మద్దతిస్తామని చెప్పారు. అలా కాకుండా మాదిగలను మరోసారి మోసం చేసేందుకు బీజేపీ, మోదీ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  

ఒవైసీవి అబద్ధాలు 
మోదీ, కేసీఆర్‌ లాంటి దొంగలను కాపాడేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అబద్ధాలు ఆడుతున్నారని రేవంత్‌ ఆరోపించారు. ‘ఆయనకు షేర్వాణీ లోపల పైజామా ఉందని అనుకున్నా. కానీ ఖాకీ నిక్కర్‌ ఉంది. ముస్లింల హక్కుల కోసం పోరాడాలని అసదుద్దీన్‌ను ఆయన తండ్రి బారిష్టర్‌ చదివించారు. కానీ ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి అసద్‌ మద్దతిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు.

రాజాసింగ్‌పై గోషామహల్‌ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు పోటీకి పెట్టలేదని ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్‌షాలకు సన్నిహితుడైన ఒక వ్యక్తికి అసదుద్దీన్‌ ఒవైసీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని ఆరోపించారు. అలా ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఒవైసీ సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మి ఆలయానికైనా, దర్గాకైనా వస్తానని, లేదా మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి రమ్మన్నా వస్తానని చెప్పారు. దీనికి అసదుద్దీన్‌ వస్తారా అని సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు