బీసీ ఆడబిడ్డకు బీజేపీ అన్యాయం: కేటీఆర్‌

14 Nov, 2023 01:15 IST|Sakshi
తుల ఉమ, స్రవంతిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌లో చేరిన తుల ఉమ, ఆలేరు నేతలు 

 సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుల ఉమకు బీ ఫారం ఇవ్వకుండా చివరి నిమిషంలో నిరాకరించడం ద్వారా బీసీ ఆడబిడ్డను బీజేపీ అవమానించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్‌ ఇచ్చిన బీజేపీ, బీసీ నేతలను అవమానాలకు గురి చేస్తోందన్నారు. కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్, బీజేపీ నాయకురాలు తుల ఉమ సోమవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

అనంతరం తుల ఉమతో పాటు ఆమె వెంట వచ్చిన నేతలను కేటీఆర్‌ పార్టీలోకి ఆహ్వనించారు. గతంలో బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తుల ఉమకు మరింత సమున్నత స్థానం కల్పిస్తామన్నారు. బీజేపీ నేతలు తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరని, వేములవాడ టికెట్‌ విషయంలో మరొకరికి దొంగదారిలో బీ ఫారం ఇచ్చారని తుల ఉమ అన్నారు.

బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి కల అని, కేవలం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని మాత్రమే ఆ పార్టీ నేతలు చూస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా, ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు సుదగోని హరిశంకర్‌గౌడ్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. సోమవారం హరిశంకర్‌గౌడ్‌తో పాటు పల్లెపాటి సత్యనారాయణ ముదిరాజ్, మేడబోయిన పరశురాములు, ఉదయకిరణ్, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి తదితరులను కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వనించారు. నల్లగొండ డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

బీఆర్‌ఎస్‌లోకి పాల్వాయి స్రవంతి 
మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆదివారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి, తిరిగి కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారో అర్ధంకాలేదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. డబ్బు మదంతో విర్రవీగుతున్న రాజగోపాల్‌రెడ్డికి మునుగోడులో బుద్ధి చెప్పాలన్నారు. గౌరవం లేనిచోట ఉండకూడదనే తన తండ్రి మాటలు స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్‌ను వీడినట్లు పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు