బీజేపీ బలవంతం మేరకే సీఎం..

16 Nov, 2020 17:15 IST|Sakshi

పట్నా : బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్‌ కుమార్‌పై ప్రతిపక్ష ఆర్జేడీ మరోసారి వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఆర్జేడీ, బీజేపీ కంటే తక్కువ స్థానాలను గెలుచుకుని సీఎం పీఠంలో కూర్చోడానికి నితీష్‌ సిగ్గుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తనకు ఏమాత్రం ఇష్టంలేకున్నా బీజేపీ నేతల బలవంతం మేరకే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు నితీష్‌ కుమార్‌ ఇదివరకే చెప్పారని ఆర్జేడీ ఈ సందర్భంగా గుర్తుచేసింది. నితీష్‌ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించిన ఆర్జేడీ ఈ మేరకు ట్విటర్‌ వేదికగా స్పందించింది.  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సాధించిన ఫలితాలే తమ నిర్ణయాని​కి కారణమని పార్టీ పేర్కొంది. (కాషాయ గూటికి మాజీ సీఎం కుమారుడు!)

‘నిజాని​కి మరోసారి సీఎంగా పని చేయడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. జేడీయూ మూడవ స్థానంలో నిలవడం ఊహించలేనిది. సీఎంగా బాధ్యతలు నిర్వర్తించే ఓపిక ఇక నాకు లేదు.’ అంటూ ఆదివారం ఎన్డీయే పక్షాల సమావేశంలో బీజేపీ నేతలతో నితీష్‌ కుమార్‌ చెప్పినట్లు ఆర్జేడీ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది.  తానే సీఎంగా ఉండాలని బీజేపీ నేతలు ఏడ్చి పట్టుబట్టారని.. వారి అభిప్రాయాన్ని కాదనలేకే సీఎంగా కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నానని నితీష్‌ చెప్పినట్లు ఆర్జేడీ వ్యంగంగా ట్వీట్‌ చేసింది.

నవంబర్‌ 10న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి 125 స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. 74 స్థానాలతో కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.  43 స్థానాలతో నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ రెండవ స్థానంలో ఉండగా వికాస్‌షీల్‌ ఇన్సాన్‌ పార్టీ(వీఐపీ), హిందుస్తాన్‌ ఆవాస్‌ మోర్చా చెరో నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఈ ఎన్నికల్లో 75 సీట్లను కైవసం చేసుకుని ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌ ఆరోపిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు