ఎమ్మెల్యేగా ఒక్క చాన్స్‌ ఇవ్వండి

7 Nov, 2023 02:09 IST|Sakshi

కరీంనగర్‌ ప్రజలకు ఎంపీ బండి సంజయ్‌ విజ్ఞప్తి 

బీజేపీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు

కరీంనగర్‌ టౌన్‌: అవినీతి, అక్రమాల ఆరోపణలు లేకుండా నిజాయితీగా పోరు సాగిస్తున్నానని బీజేపీ కరీంనగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు. నిండు మనసుతో తనను ఆశీర్వదించాలని.. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. సోమవారం మధ్యాహ్నం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండి సంజయ్‌ రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్‌ విఠల్, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్ల రమేశ్, సోదరుడు బండి సంపత్, కిరణ్‌సింగ్‌తో కలసి కరీంనగర్‌ కలెక్టరేట్‌లోకి కారు నడుపుకుంటూ వెళ్లిన సంజయ్‌.. ఎన్నికల రిటరి్నంగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అవినీతికి, అక్రమాలకు తావులేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.

ఇప్పటివరకు ప్రజలు అన్ని పార్టీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారని, ఈసారి తనకు ఒక్క చాన్స్‌ ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ. వేల కోట్లు ఇస్తున్నా ఇక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దారిమళ్లించారని ఆరోపించారు. పేదలకు ఒక్క కొత్త రేషన్‌ కార్డు ఇవ్వలేదని, ఇళ్లు మంజూరు చేసినా పేదలకు ఇవ్వలేదని ఆరోపించారు. ఒకట్రెండు పథకాలు అమలు చేసి అదేదో గొప్ప పని చేసినట్లు భూతద్దంలో చూపుతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో ప్రశాంతమైన వాతావరణం ఉందా? అని ప్రశ్నించారు.

కమీషన్లు ముట్టజెబితే తప్ప పనులు అయ్యే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. బీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి శాంతిభద్రతలకు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. కరీంనగర్‌లో ప్రశాంత వాతావరణం ఉండాలన్నా, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్నా, అవినీతికి తావులేని పాలన కావాలన్నా బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. 

డబ్బు వైపా లేక ధర్మం వైపా ప్రజలు తేల్చుకోవాలి: రాజాసింగ్‌ 
కరీంనగర్‌ ప్రజలు ధర్మం కోసం నిరంతరం పోరాడుతున్న బండి సంజయ్‌ పక్షాన ఉంటారో లేక అవినీతి, అక్రమాలతో రూ.వేల కోట్లు సంపాదించి ఓటుకు రూ. 20 వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు.

కరీంనగర్‌లో సంజయ్‌ పోటీ చేస్తున్నారని తెలియగానే గంగుల కమలాకర్‌ దారుస్సలాం వెళ్లి ఎంఐఎం అధినేతకు సలాం చేశారని... అయినా సంజయ్‌ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ తెచ్చి ముస్లిం మహిళలు గర్వపడేలా చేసింది బీజేపీయేనని మైనారిటీలు గుర్తించాలన్నారు. 

బండి సంజయ్‌పై 35 కేసులు.. 
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్‌ సోమవారం ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనపై పలు సందర్భాల్లో 35 కేసులు (గత అసెంబ్లీలో కేవలం 5 కేసులు) ఉన్నాయని పేర్కొన్నారు. అవన్నీ విచారణ దశలోనే ఉన్నాయన్నారు.

సంజయ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి భూములు, గృహాలు లేకపోవడం గమనార్హం. మొత్తంమీద సంజయ్‌ దంపతుల ఆస్తుల విలువ రూ.79.51 లక్షలు మాత్ర మే. ఇక తనకు రూ.5.44 లక్షల రుణాలు, తన భార్యకు రూ.12.40 లక్షల రుణాలు ఉన్నాయని ఆయన అఫిడవిట్‌లో పొందుపరిచారు.

మరిన్ని వార్తలు