ఐదు అసెంబ్లీల ఎన్నికల ప్రచారానికి రూ.252 కోట్లు

12 Nov, 2021 06:05 IST|Sakshi

ఎన్నికల సంఘానికి తెలిపిన బీజేపీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ప్రచారం కోసం రూ.252 కోట్లు ఖర్చు చేసినట్లు బీజేపీ వెల్లడించింది. ఇందులో 60% మేర బెంగాల్‌లోనే ఖర్చు చేసినట్లు తెలిపింది. అస్సాం, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార ఖర్చు వివరాలను బీజేపీ తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించింది. మొత్తం ఖర్చు రూ.252 కోట్లకుగాను అత్యధికంగా రూ.151 కోట్లను బెంగాల్‌లో ఖర్చు పెట్టింది. అస్సాంలో రూ.43.81 కోట్లు, పుదుచ్చేరిలో రూ.4.79 కోట్లు, తమిళనాడులో  రూ.22.97 కోట్లు వ్యయం చేసింది. తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీకి 2.6% ఓట్లు మాత్రమే పడ్డాయి. కేరళలో  రూ.29.24 కోట్లు ఖర్చు చేసింది. ఈ వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఉంచింది.  బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ  రూ.154.28 కోట్లు వెచ్చించినట్లు  ఎన్నికల సంఘానికి తెలిపింది.

మరిన్ని వార్తలు