ఆ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు

29 Mar, 2021 04:03 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి బొత్స

పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని 32 పురపాలక సంఘాలు, 3 నగరపాలక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విలీన గ్రామాలతో కలిపే రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నిక జరుగుతుందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మూడు రాజధానుల ఏర్పాటుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

టీడీపీ స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టులకు వెళ్లి మూడు రాజధానుల ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించిందన్నారు. అయినప్పటికీ న్యాయస్థానాల్లో విజయం సాధించి, ఏ క్షణంలోనైనా రాజధానిని విశాఖకు తరలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని క్లీన్, గ్రీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దీనిపై కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెలాఖరున విజయవాడలో మునిసిపల్‌ అధికారులకు వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విశాఖ మినహా ఎక్కడా లేనివిధంగా రాజమహేంద్రవరంలో రూ.4 కోట్లతో అత్యాధునిక కబేళాను నిర్మించామన్నారు. రాజమహేంద్రవరాన్ని మోడల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు