కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా యడియూరప్ప తనయుడు విజయేంద్ర

10 Nov, 2023 19:10 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా విజయేంద్ర యడియూరప్పను నియమించింది అధిష్టానం. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడే  ఈ విజయేంద్ర. 

నళిన్ కటీల్‌ను తప్పించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్రకు కర్ణాటక పగ్గాలు అప్పజెప్పింది కమల అధిష్టానం. విజయేంద్ర ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. షికారిపుర నుంచి 11 వేల మెజార్టీతో నెగ్గారు. 2018లో ఇదే నియోజకవర్గం నుంచి యడియూరప్ప పోటీ చేసి గెలుపొందారు.

న్యాయ విద్యను అభ్యసించిన విజయేంద్ర.. పార్టీ యువ విభాగం భారతీయ జనతా యువ మోర్చా కర్ణాటక యూనిట్‌కు జనరల్‌ సెక్రటరీగా పని చేశారు. ఆపై 2020 నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. యడియూరప్ప పెద్ద కొడుకు రాఘవేంద్ర కూడా రాజకీయాల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. షిమోగా నుంచి పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగుతున్నారాయన. 

మరిన్ని వార్తలు