Telangana: ఒక్కరోజే 1,129 నామినేషన్లు 

10 Nov, 2023 04:37 IST|Sakshi

గురువారం ఒక్కరోజే రికార్డు సంఖ్యలో దాఖలు 

నేటితో ముగియనున్న గడువు

13న నామినేషన్ల పరిశీలన.. 15 వరకు ఉపసంహరణ గడువు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల దాఖలు ఘట్టం శుక్రవారం ముగియనుంది. గురువారం ఏకాదశి సుముహూర్తం కావడంతో భారీసంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చి నామినేషన్లు వేశారు. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో గురువారం రికార్డు సంఖ్యలో 1,129 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) కార్యాలయ వర్గాలు తెలిపాయి.

బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో, మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్లు వేశారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు ప్రారంభమైన నాటి నుంచి బుధవారం వరకు 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 1,188 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) కార్యాలయం ప్రకటించింది.

గురువారం నాటికి దాఖలైన మొత్తం నామినేషన్ల వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి  ఉంది. రెండురోజుల తర్వాత (13వ తేదీన) నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదేరోజు అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉండే అభ్యర్థులెవరో తేలిపోతుంది. నవంబర్‌ 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి.   

మరిన్ని వార్తలు