నామినేషన్‌ వేశారని దాడులు చేస్తున్నారు

20 Feb, 2021 02:55 IST|Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

సాక్షి, అమరావతి: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పోలీసు అధికారులను కోరారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని, పెదకూరపాడు నియోజకవర్గంలోని లింగాపురం పంచాయతీ ఎన్నికలకు నామినేషన్‌ వేశారనే కోపంతో వైఎస్సార్‌సీపీ నేతలు దళితులపై దాడిచేశారని ఆరోపించారు. ఈ దాడి సీఎం జగన్‌ ఫ్యాక్షన్‌ పాలనకు నిదర్శనమని ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీచేసే హక్కు ఉందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. దళితులు రాజకీయాల్లోకి రాకూడదా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నేతల దాడి ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ అని పేర్కొన్నారు.

ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నా ప్రజామద్దతు ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కులం పేరుతో దూషించి, రాళ్లతో దాడిచేసిన వైఎస్సార్‌సీపీ నేతలపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేయాలని అర్ధరాత్రి నుంచి స్టేషన్‌ బయటే పడిగాపులు కాస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు.  

చదవండి: (కోనసీమలో పల్లెపోరు)

మరిన్ని వార్తలు