సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం

30 Mar, 2021 04:19 IST|Sakshi

టీడీపీ ఆవిర్భావ సభలో చంద్రబాబు

సాక్షి, అమరావతి:  అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నపుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయని, 30 ఏళ్లలో ఎప్పుడూ భయపడలేదని, ఇప్పుడు కూడా భయపడబోనన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికలను ఏకపక్షం చేసుకుని అంతా అయిపోయిందనుకుంటున్నారని, ఈ ప్రభుత్వం ఆటలు సాగనిచ్చేది లేదన్నారు.

రాష్ట్రాభివృద్ధి రివర్స్‌గేర్‌లో నడుస్తోందని విమర్శించారు. రెండేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతి కుటుంబంపై రూ.2.5 లక్షల భారం మోపారని తెలిపారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో రూ.70 వేల కోట్ల బకాయిలున్నాయని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని తెలిపారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 28 మంది ఎంపీలు కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలని, రెండేళ్లలో ఉద్యోగాలు వచ్చే ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమను తాకట్టు పెట్టారని, నాసిరకం మద్యం ద్వారా రూ.వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఉచితంగా దొరికే ఇసుక ఇప్పుడు బంగారం అయిపోయిందన్నారు. 

మరిన్ని వార్తలు