బాబోయ్‌ చినబాబా? సీమ టీడీపీ నేతల నెత్తిన పిడుగు!

19 Dec, 2023 13:28 IST|Sakshi

చినబాబుకు గ్రేటర్ సీమ బాధ్యతలు ?

చంద్రబాబు మదిలో కొత్త కాన్సెప్ట్ 

సీమ నేతల అభిప్రాయం కోరిన టీడీపీ అధినేత

మమ్మల్నిలా ఉండనివ్వండి సామీ అంటున్న టీడీపీ సీమ నేతలు

తమనూ, పార్టీని ముంచేయొద్దంటున్న బాబు వద్దకు విజ్ఞప్తులు 

చంద్రబాబు మదిలో మెదిలిన కొత్త ఆలోచన.. గ్రేటర్ రాయలసీమ నాయకుల్లో కలవరం రేపుతున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. నారా లోకేష్‌ బాబుకి  అక్కడి ఎన్నికల పగ్గాలు అప్పజెప్పడం. ‘‘చాలు.. అయన ఘనకార్యాలు.. అయన వీరత్వం మేము కళ్లారా చూశాం.. ఇక చాలు. ఆయన్ను మా నెత్తిన రుద్దకండి’’ అని నాయకులు చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది.

బ్రేకులతో సాగిన యువగళం పాదయాత్ర అనంతరం.. లోకేష్ ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు అని భావిస్తున్నారు చంద్రబాబు. అందుకే లోకేష్‌ నెత్తిన బృహత్తరమైన బాధ్యత పెట్టాలని చూస్టున్నట్లు తెలిసింది. అయితే ఆ ప్రతిపాదన విన్న టీడీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నట్లు తెలిసింది. ఇంతకీ చంద్రబాబు లోపల ఏముందంటే... 

‘‘కడప, కర్నూలు.. అనంతపురం.. చిత్తూరుతోబాటు.. నెల్లూరు.. ప్రకాశం జిల్లాలు కలిపి గ్రేటర్ రాయలసీమగా పరిగణించే ప్రాంతానికి చినబాబును ఇంచార్జ్ గా పెట్టి ఎన్నికలకు వెళ్లాలి. అంటే ఆ ఆరు జిల్లాల్లోని 74సీట్ల అభ్యర్ధుల ఎంపిక,ప్రచారం,గెలుపు బాధ్యతలు అన్నీ లోకేష్ కు అప్పగిస్తే అయన గెలిపించుకు వస్తారు. రాష్ట్రం మొత్తాన్ని నేనొక్కడ్ని చూసుకోవడం అంటే కష్టం. ఆ 74 సీట్లను లోకేష్ కు అప్పగించి, మిగతా స్థానాలను.. అంటే కోస్తానుంచి ఉత్తరాంధ్ర వరకు తానూ, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌ కలిపి మ్యానేజ్ చేసుకోవచ్చు’’అని అంతర్గతంగా ఆయన నేతల వద్ద ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. 


మాకొద్దు బాబోయ్.. అంటున్న నాయకులు

ఇదింకా వాస్తవ రూపం దాల్చలేదు.. ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. వామ్మో.. లోకేష్ పెత్తనం అంటే ఇక గెలిచినట్లే! ఆయనే గెలుస్తాడో గెలవడో తెలియని పరిస్థితి!!. అలాంటి లోకేష్ కు ఈ ప్రాంతం గురించి రాజకీయ, కుల, ఆర్థిక , సామాజిక సమీకరణాల గురించి ఏమి తెలుసనీ ఆయన్ను బాధ్యునిగా చేస్తున్నారు. అయన నిజంగా లాగుతారా ? ఏ నియోజకవర్గం ఎక్కడ ఉందో ఆయనకు అవగాహనలేదు. ఈ ప్రాంతంగుండా వెళ్లిన పాదయాత్రలో అయన విశ్వరూపం చూశాం.. ఇక ఇప్పుడు ఆయన్ను మా నెత్తినబెట్టి పార్టీ పుట్టిముంచొద్దు అని నాయకులు లోలోన ఫీలవుతున్నారు. నిజంగా అలా చేస్తారా? లేదా? అనేది పక్కనబెడితే.. ఆ ఊహను కూడా భరించలేకపోతున్నారు.

వైసీపీ బలం ముందు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాయలసీమతో బాటు 2019 ఎన్నికల్లో   అన్ని సీట్లనూ గెలుచుకున్న నెల్లూరు వంటి ప్రాంతాలు లోకేష్ కు ఇవ్వడం ఆత్మహత్య సదృశం అని అంటున్నారు. దీంతోబాటు రాయలసీమతో గత ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం మూడంటే మూడే గెలిచింది అంటే అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో అర్థం అవుతోంది. అయితే చంద్రబాబు మదిలో ఉన్న ఆలోచన ఇంకా  వాస్తవరూపం దాల్చలేదు కానీ.. నిజంగా చంద్రబాబు అలా చేస్తారా ? ఆ ఆరు జిల్లాల బాధ్యత  లోకేష్ కు అప్పగించే సాహసం చేస్తారా ? నిజంగా కొడుకు మీద ఆయనకు అంత నమ్మకం ఉందా? అనే సందేహాలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి.. 

✒️✒️  సిమ్మాదిరప్పన్న

>
మరిన్ని వార్తలు