రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వ సంస్థ..

19 Dec, 2023 13:22 IST|Sakshi

డిజిట‌ల్ చెల్లింపుల‌కు సంబంధించి ఎదుర‌వుతున్న సైబ‌ర్ సెక్యూరిటీ స‌వాళ్ల‌ను పరిష్కరించడానికి ప్రభుత్వం సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ స‌హాయ‌మంత్రి భ‌గ‌వ‌త్ క‌ర‌ద్ చెప్పారు. 

కేంద్ర ఆర్థికశాఖ సమక్షంలో ఇటీవల జరిగిన భేటీలో బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల స‌న్న‌ద్ధ‌త గురించి చ‌ర్చించామ‌ని మంత్రి క‌ర‌ద్ పేర్కొన్నారు. సైబ‌ర్ దాడులు, డిజిట‌ల్ చెల్లింపుల‌కు సంబంధించి అవ‌క‌త‌వ‌క‌లపై పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. ఆర్థిక మోసాలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. డిసెంబరు 4, 2023 వరకు జరిగిన 4 లక్షలకు పైగా సంఘటనల్లో ఈ వ్యవస్థ మొత్తం రూ.1,000 కోట్లకు మించి ఆదా చేసిందని పేర్కొన్నారు.

ప‌లువురి ఖాతాల్లో న‌వంబ‌ర్‌, 2023లో పొర‌పాటున జ‌మ అయిన రూ.820 కోట్ల‌కు గాను రూ.705.31 కోట్ల‌ను యూకో బ్యాంక్ రిక‌వ‌రీ చేసింద‌ని కేంద్ర ఆర్థికశాఖ స‌హాయ‌మంత్రి భ‌గ‌వ‌త్ క‌ర‌ద్ ఈ సమావేశంలో వెల్ల‌డించారు. బ్యాంక్ ఐఎంపీ పేమెంట్ ఛానెల్‌లో సాంకేతికలోపంతో 41,000 యూకో బ్యాంక్ ఖాతాల్లోకి పొర‌పాటున ఈ నిధులు జమ అయినట్లు బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి న‌వంబ‌ర్ 15న యూకో బ్యాంక్ ఇద్ద‌రు స‌పోర్ట్ ఇంజినీర్లు, ఇత‌ర వ్య‌క్తుల‌పై సీబీఐ వ‌ద్ద ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. ప‌శ్చిమ బెంగాల్‌, కర్ణాట‌క‌లోని 13 ప్ర‌దేశాల్లో డిసెంబ‌ర్ 5న సీబీఐ సోదాలు చేప‌ట్టింది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఈ మెయిళ్లకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టింది.

ఇదీ చదవండి: ఆఫీస్‌లో కాసేపు పడుకోనివ్వండి!

ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, ఏటీఎంలు, బ్యాంక్ బ్రాంచ్‌లతో సహా వివిధ ఛానెల్‌ల ద్వారా యాక్సెస్ చేయగల 24/7 ఇంటర్‌బ్యాంక్ మొబైల్, ఐఎంపీఎస్‌లో లోపం ఏర్పడినట్లు విచారణలో తేలిందని అధికారులు వివరించారు.

>
మరిన్ని వార్తలు