కేసులున్నవారే.. కానీ యోగ్యులు! 

22 Nov, 2023 04:16 IST|Sakshi

నేరారోపణలున్న వారికి టికెట్లు ఇవ్వడంపై రాజకీయ పార్టీల వివరణ 

పార్టీకి విధేయులను ఎంపిక చేశామని బీఆర్‌ఎస్‌ వివరణ 

వారిపై ఉన్న కేసుల్లో పస లేదని వెల్లడి

కార్యకర్తల అభీష్టం మేరకే ఎంపిక చేశామన్న కాంగ్రెస్‌ పార్టీ 

సదరు అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యేలు,మంత్రులు కావడమే కారణమని వివరణ 

ఇంకా అభ్యర్థులపై డిక్లరేషన్‌ ప్రకటించని బీజేపీ 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నేరారోపణలు, పోలీసు కేసులున్నవారికి అభ్యర్థులుగా అవకాశం ఇవ్వడంపై ప్రధాన రాజకీయ పార్టీలు వివరణలు ఇచ్చాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎలాంటి నేరారోపణలు లేని ఔత్సాహికుల పేర్లను సైతం పరిశీలించామని.. అయితే యోగ్యతల విషయంలో వారు నేరచరిత్ర గల అభ్యర్థులకు సాటిలేరని బీఆర్‌ఎస్‌ ప్రకటించింది.

వారంతా పార్టీకి విధేయులని, అధినాయకత్వం చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో వారికి తిరుగులేదని పేర్కొంది. ఇక మాజీ మంత్రులు/మాజీ ఎమ్మెల్యేలు/ ప్రస్తుత ఎంపీలు/ ఎమ్మెల్సీలు కావడంతోనే నేరచరిత్ర/కేసులున్న అభ్యర్థులను ఎంపిక చేశామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. తమ పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు వారిని ఎంపిక చేశామని పేర్కొంది.

ఈ మేరకు కళంకిత అభ్యర్థులకు టికెట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న అంశంపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ తమ అధికారిక వెబ్‌సైట్లలో బహిరంగ ప్రకటనలు జారీ చేశాయి. నిబంధనల మేరకు అభ్యర్థుల నేర చరిత్రను ‘ఫార్మాట్‌ సీ–2’రూపంలో వెల్లడించాయి. బీజేపీ ఇంకా తమ అభ్యర్థుల నేరారోపణలు, కేసుల అంశంపై ప్రకటన జారీ చేయలేదు. 

మా అభ్యర్థులపై ఆరోపణలు, కేసుల్లో పసలేదు: బీఆర్‌ఎస్‌ 
బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం అభ్యర్థుల యోగ్యతలు, అయోగ్యతలను క్షుణ్నంగా పరిశీలించాకే ఎంపిక చేసిందని పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌ డిక్లరేషన్‌లో ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేస్తున్న 119 మంది అభ్యర్థుల్లో 57 మంది విషయంలో ఉమ్మడిగా ఈ డిక్లరేషన్‌ జారీ చేశారు. ప్రజాజీవితంలో ప్రశంసనీయ అనుభవాన్ని కలిగి ఉండడంతోపాటు తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారనే ఈ అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు.

‘‘అభ్యర్థులంతా విద్యావంతులేగాక సమాజంలో ఉన్నతస్థాయిల్లో ఉన్నవారే. వారిపై ఆరోపణలు, కేసుల తీవ్రతను పార్టీలోని సంబంధిత విభాగం పరిశీలించి వాటిలో పసలేదనే భావనకు వచ్చింది. అందుకే ఈ అభ్యర్థులు సరైనవారని పార్టీ అధినాయకత్వం భావించి తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి కోసం ఎంపిక చేసింది’’అని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. 

కార్యకర్తల అభీష్టం మేరకు.. 
మొత్తం 52మంది అభ్యర్థులపై నేరారోపణలు, వారి ఎంపిక కారణాలను కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. ఒక్కో అభ్యర్థి ఎంపికపై ప్రత్యేకంగా కారణాలను వివరించింది. నేరచరిత్ర లేని ఇతర అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేయలేదనే అంశంపై వివరణ ఇస్తూ.. పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు ఎంపిక జరిగిందని తెలిపింది. ప్రస్తుతం ఎంపీ కావడం, ప్రజాదరణ ఉండటంతోనే టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కొడంగల్‌ స్థానానికి ఎంపిక చేసినట్టు వెల్లడించింది. పేరొందిన డాక్టర్లు, న్యాయవాదులు, తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు కావడంతో మరికొందరిని ఎంపిక చేసినట్టు తెలిపింది. 

‘నేరచరిత’ ప్రకటన ఎందుకు? 
కేంద్ర ఎన్నికల సంఘం 2020 మార్చి 6న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న తమ అభ్యర్థులపై నేరారోపణలు/కేసుల వివరాలను ‘ఫార్మట్‌–సీ2, ఫార్మాట్‌– సీ7’రూపంలో తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. సదరు నేరాల స్వభావం, చార్జిషీట్‌ దాఖలు అయిందా, కోర్టు పేరు, కేసు నంబర్‌ వంటి వివరాలనూ అందులో పేర్కొనాలి. దీనితోపాటు సదరు అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేశారు?

నేరచరిత్ర లేని ఇతర అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేయలేకపోయారన్న వివరణను కూడా పొందుపరచాలి. అభ్యర్థుల విద్యార్హతలు, సాధించిన ఘనతలు, విజయాలు, ప్రతిభ వంటి అంశాలనూ పేర్కొనాలి. ఈ సమాచారాన్ని ఒక ప్రాంతీయ, ఒక జాతీయ పత్రికలో సైతం ప్రచురించాలి. రాజకీయ పార్టీకి సంబంధించిన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లోనూ ఈ వివరాలను వెల్లడించాలి.  

మరిన్ని వార్తలు