విజయానికి ఏడు హామీలు 

22 Nov, 2023 03:24 IST|Sakshi

రాజస్థాన్‌లో గహ్లోత్‌కు చావో రేవో

ప్రజాకర్షక పథకాలపైనే ఆశలు 

సర్వశక్తులూ ఒడ్డుతున్న సీఎం

చరిత్రను తిరగరాసే ప్రయత్నం

రాజస్థాన్‌లో గత 30 ఏళ్లలో అధికార పార్టీ నెగ్గిన దాఖలా లేదు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారుతూ వస్తోంది. ఈసారి మాత్రం వరుసగా రెండో విజయంతో చరిత్రను తిరగరాసేందుకు సీఎం అశోక్‌ గహ్లోత్‌ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ విషయంలో ‘ఏడు హామీ’లపై బాగా ఆశలు పెట్టుకున్నారు. ఆ పథకాలు తనను కచ్చితంగా గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు...! 

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పర్వం క్‌లైమాక్స్‌కు చేరుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్‌కు మరో మూడు రోజులే ఉంది. గురువారం సాయంత్రంతో ప్రచారానికి కూడా తెర పడనుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని సీఎం గహ్లోత్‌ టాప్‌ గేర్‌లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌ తరఫున అంతా తానై వ్యవహరిస్తున్నారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో వీలైనన్ని అసెంబ్లీ స్థానాలను కవర్‌ చేయనున్నారు. ముఖ్యంగా మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ప్రచార సభలోనూ అవి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. 

జీవన్మరణ సమస్య! 
72 ఏళ్ల గహ్లోత్‌కు ఒకరకంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్‌ యువ నేత సచిన్‌ పైలట్‌ను ఈసారి ఆయన పూర్తిగా పక్కన పెట్టారు. కనుక ఫలితాలు ఏ మాత్రం వికటించినా గహ్లోత్‌ రాజకీయ జీవితానికి తెర పడవచ్చన్న అభిప్రాయముంది. అందుకే కొద్ది రోజులుగా ఆయన దూకుడు పెంచారు.

రోజుకు కనీసం నాలుగైదు సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఒక్క రోజు ఏకంగా 800 కిలోమీటర్లు పర్యటిస్తున్నారు! తన ఓబీసీ సామాజిక వర్గ మూలాలను కూడా సమయానుకూలంగా ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రచార సభలోనూ ప్రధాని మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆయన ప్రసంగాల్లో కాంగ్రెస్‌ పథకాలనే యథాతథంగా కాపీ కొడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమ ఏడు హామీలకు పోటీగా బీజేపీ తెరపైకి తెచ్చిన ‘మోదీ హామీ’లను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, అవన్నీ కాంగ్రెస్‌ హామీలకు నకళ్లేనని పదేపదే చెబుతున్నారు.

‘‘ఇది బీజేపీకి బాగా మైనస్‌గా మారుతోంది. ఈసారి కచ్చితంగా గెలుపు కాంగ్రెస్‌దే. ఓటర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నారు కూడా’’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా స్వీయ ప్రచార వీడియోలను కూడా విడుదల చేస్తూ, అవి వీలైనంత మందికి చేరేలా జ్రాగత్తలు తీసుకుంటున్నారు గహ్లోత్‌. 

అధిష్టానం అనుగ్రహం కోసం... 
రాష్ట్రస్థాయిలో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే, అధిష్టానంతో సంబంధాలను కూడా సరిదిద్దుకునే పనిలో పడ్డారు గహ్లోత్‌. గతేడాది కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాల్సిందిగా సోనియా ఆదేశించినా ఆయన బేఖాతరు చేయడం తెలిసిందే. దీనిపై గాంధీ కుటుంబం గుర్రుగా ఉన్న నేపథ్యంలో, వీలు దొరికినప్పుడల్లా సోనియా, రాహుల్, ప్రియాంకలను ఆయన ఆకాశానికెత్తుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రచార పర్వమంతా రాహుల్, ప్రియాంక కనుసన్నల్లోనే జరుగుతోందని పదేపదే చెప్పుకొస్తున్నారు.  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

రాజస్థాన్లో కాంగ్రెస్‌ ఏడు హామీలు... 

1. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా రూ.10,000 భృతి 

2. ప్రభుత్వ కాలేజీలో చేరే ప్రతి విద్యార్థికి ల్యాప్‌టాప్‌ లేదా ట్యాబ్‌ 

3. చిరంజీవి ఆరోగ్య బీమా పథకం ద్వారా రూ.25 లక్షల దాకా వైద్య సాయం. ఇందులో భాగంగా రూ.15 లక్షల ప్రమాద బీమా 

4. అందరికీ ఉచితంగా ఇంగ్లిష్‌ మీడియం విద్య 

5. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌ 

6. పాత పెన్షన్‌ పథకానికి చట్టబద్ధత 

7. రైతుల నుంచి రూ.2కు కిలో చొప్పున పేడ కొనుగోలు  

మరిన్ని వార్తలు