ఆఖరి క్షణం దాకా అప్రమత్తం 

29 Nov, 2023 05:33 IST|Sakshi

ప్రచారం ముగియడంతో తదుపరి కార్యాచరణపై బీఆర్‌ఎస్‌ దృష్టి 

పోలింగ్‌ ముగిసేదాకా అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ దిశా నిర్దేశం  

గజ్వేల్‌ నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం ముగియడంతో వచ్చే రెండురోజుల పాటు అనుసరించాల్సిన వ్యూహంపై భారత్‌ రాష్ట్ర సమితి దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభల పేరిట బహిరంగ సభల్లో పాల్గొన్న పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌ సభ అనంతరం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం తీరుతెన్నులను సమీక్షించిన కేసీఆర్‌.. పోలింగ్‌ ప్రక్రియ ముగిసేంత వరకు క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్, నాయకులు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

చివరి నిమిషం వరకు ఓటర్లతో సమన్వయం చేసుకుంటూ ఒక్కో ఓటును ఒడిసి పట్టుకోవాలని సూచించారు. పోలింగ్‌ శాతం పెరిగేలా చూసుకోవడంతో పాటు, దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించడంపై దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ప్రత్యర్థి పారీ్టల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రలోభాలపై ప్రత్యేకంగా కన్నేసి ఉంచాలంటూ పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయి. చివరి ఓటు పడేంత వరకు పార్టీ ఏజెంట్లు పోలింగ్‌ బూత్‌లలోనే ఉండేలా చూసుకోవాలని సూచించారు. పార్టీ బలహీనంగా ఉన్న బూత్‌ల పరిధిలో అనుకూల ఓట్లు ఖచ్చితంగా పోలయ్యేలా చూసుకోవాలని ఆదేశించారు. 

96 సభల్లో పాల్గొన్న సీఎం 
కేసీఆర్‌ గత నెల 15 నుంచి ప్రజా ఆశీర్వాద సభల పేరిట ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 33 రోజుల వ్యవధిలో ఏకంగా 96 నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. అక్టోబర్‌ 15న హుస్నాబాద్‌లో ప్రారంభించిన ప్రచారాన్ని, మంగళవారం గజ్వేల్‌లో ముగించారు. నవంబర్‌ 9న తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ నామినేషన్లు దాఖలు చేశారు.

మరోవైపు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు కూడా రెండు నెలల పాటు నిర్విరామ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. రోడ్‌షోలు, బహిరంగ సభలు కలుపుకొని సుమారు వందకు పైగా ప్రాంతాల్లో ప్రసంగించారు. ఓ వైపు పార్టీ విధానాలను వివరించేందుకు వరుసగా మీడియా సమావేశాలు, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూనే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, పార్టీ నేతలతో వరుస టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.

మరిన్ని వార్తలు