ఆ పార్టీలు చేతులు కలిపేనా? కాంగ్రెస్‌లో కొరవడిన స్పష్టత 

26 Sep, 2023 09:17 IST|Sakshi

ఇతర పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్‌లో ఇప్పటికీ కొరవడిన స్పష్టత 

అసలు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై కేడర్‌లో గందరగోళం 

కామ్రేడ్లతో పాటు టీజేఎస్, బీఎస్పీలతో కుదరవచ్చంటున్న పార్టీ వర్గాలు 

పొత్తుకు సిద్ధంగా కోదండరాం.. విలీనానికి మాత్రం నో! 

బీఎస్పీతో ప్రాథమిక చర్చలు కూడా ప్రారంభం కాని వైనం 

సాక్షి, హైదరాబాద్‌:  వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్‌ పార్టీలో స్పష్టత రావడం లేదు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి (టీజేఎస్‌), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లతో ఈసారి పొత్తు కుదిరే అవకాశముందనే చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే సమయం సమీపిస్తున్నా రాష్ట్రస్థాయిలో ఇంతవరకూ ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనలు లేకపోవడం, ఈ దిశగా ఎలాంటి తాజా కదలిక లేకపోవడంతో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై పార్టీ కేడర్‌ గందరగోళానికి గురవుతోంది.

ముఖ్యంగా సీపీఐ, సీపీఎంలతో పొత్తు విషయంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి ఆ పార్టీలతో గతంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగాయి. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌లో సీపీఐ నేత నారాయణతో మంతనాలు జరిపారు. కానీ ఇంతవరకు ఏమీ తేల్లేదు. కామ్రేడ్లు అడిగినట్టుగా భావిస్తున్న సీట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేయడంతో వామపక్షాలతో పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.దీనిపై అధిష్టానం వీలున్నంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, ఏదో ఒకటి త్వరగా తేల్చితేనే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని, లేదంటే గత ఎన్నికల్లో మహాకూటమి పొత్తు లాగానే విఫలమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.  

ఆరు స్థానాలపై టీజేఎస్‌ దృష్టి 
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాంను కూడా ఇప్పటికే కాంగ్రెస్‌ వర్గాలు సంప్రదించాయి. ఢిల్లీ నుంచి ఆయనతో మంతనాలు జరిగాయని, ఈ సందర్భంగా పార్టీ విలీనం ప్రస్తావన వచ్చిందని, ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ప్రొఫెసర్‌.. పొత్తుకు మాత్రం అభ్యంతరం లేదని చెప్పారని తెలిసింది. అయితే ఈసారి ఆరు స్థానాలపై టీజేఎస్‌ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

సూర్యాపేట, జహీరాబాద్, నర్సంపేట, ఎల్లారెడ్డి, గద్వాల, కోరుట్లపై ప్రధానంగా దృష్టి సారించామని, ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే మిగిలిన చోట్లా తమకు అభ్యర్థులు ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో బీఎస్పీతో సంబంధాలు ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రతిపాదన ఉందని కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారు. అయితే ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో కూడా చర్చలు ప్రారంభం కాకపోవడం గమనార్హం.  

కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు 
ఈసారి పొత్తుల విషయమై కాంగ్రెస్‌ పార్టీలో రెండు అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు వీలున్నన్ని తక్కువ స్థానాలు ఇచ్చి పొత్తు కుదుర్చుకుంటే మంచి ఫలితం వస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం ఏ పార్టీ తోనూ పొత్తు అవసరం లేదని, ఒంటరిగా ఎన్నికలకు వెళితేనే కచ్చితంగా మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకులకు సమాచారం లేకుండానే ఇతర పార్టీలతో చర్చలు జరుపుతుండటంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు  అంటున్నారు.   

మరిన్ని వార్తలు