జానారెడ్డి ఫ్యామిలీ నుంచి పొలిటికల్‌ ఎంట్రీ.. పోటీ చేసేది ఎవరంటే?

31 Mar, 2023 12:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తన కొడుకు పోటీ చేస్తాడని క్లారిటీ ఇచ్చారు. అలాగే, బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు తప్పదు అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కాగా, జానారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుడూ.. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం. పార్లమెంట్‌లో జరుగుతున్న వ్యవహారంతో దేశం అట్టుడుకుతోంది. దేశంలో బీజేపీ పెట్టుబడుదారుల కొమ్ము కాస్తోంది. అదానీ కంపెనీలో షేర్లు పెట్టిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదానీ, ప్రధాని మోదీ సంబంధాలపై రాహుల్‌ గాంధీ నిలదీశారు. రాహుల్‌ ప్రశ్నించకుండా ఉండేదుకే ఇలా ఆయన గొంతు నొక్కారు. అదానీ వ్యవహారం బయటపడొద్దని రాహుల్‌ను పార్లమెంట్ నుంచి బయటకు పంపించారు. అక్రమాలకు, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా రాహుల్‌ మాట్లాడుతున్నారు. 

ప్రధాని మోదీ అధికార యంత్రాంగాన్ని వాడుకుని రాజకీయ కక్ష సాధింపులకు దిగుతున్నారు. ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం వచ్చింది. దేశవ్యాప్తంగా మోదీ పరిపాలనకు వ్యతిరేకంగా 17 పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్ని కాంగ్రెస్‌కు మద్దుతివ్వాలి. ప్రజాస్వామ్య విలువలు కాపాడింది, కాపాడేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. అధికారం కోసం బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి బుద్ధి చెప్పాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తన కొడుకు బరిలోకి దిగుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. 
 

మరిన్ని వార్తలు