బీఆర్‌ఎస్‌ పాలనలో యువత భవిష్యత్తు నాశనం

16 Nov, 2023 03:29 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ ధ్వజం 

మద్యానికి, డ్రగ్స్‌కు బానిసలను చేశారు... 10 అంశాలతో యూత్‌ చార్జిషీట్‌ విడుదల చేసిన కాంగ్రెస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పాలనలో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతోందని కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. సీఎం కేసీఆర్‌ అసమర్థ పాలనలో యువకులు మద్యానికి బానిసలవుతున్నారని, విద్యారంగానికి కేటాయింపులు తగ్గించి, సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయక, ఉద్యోగ పరీక్షల నిర్వహణ కూడా సరిగా చేయలేకపోవడంతో రాష్ట్ర యువత నిర్వి ర్యం అయిపోతోందని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ బుధవారం పది అంశాలతో కూడిన యూత్‌ చార్జిషీట్‌ను విడుదల చేసింది.  

యూత్‌ చార్జిషీట్‌లోని అంశాలివే.. 
దేశంలోనే విద్యారంగానికి తెలంగాణలో కేటాయింపులు తక్కువ. 2014–15లో రాష్ట్ర బడ్జెట్‌లో 10.98 శాతం నిధులు విద్యకు కేటాయించగా, 2023–24లో 7.6 శాతానికి తగ్గించారు.  
♦ కేజీ టు పీజీ విద్యను 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఈ తొమ్మిదేళ్లలో ఒక్క కొత్త తరగతి గదిని కూడా నిర్మించలేదు. ఒక్క గంభీరావుపేటలో మాత్రమే కేజీ టు పీజీ క్యాంపస్‌ను నిర్మించారు.  
♦ సీఎస్‌ఆర్‌ నిధులతో ఒక్క తరగతి గదినయినా కట్టించాలని కార్పొరేట్‌ కంపెనీలను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది.  
 ప్రతి ఇంటికీ ఉద్యోగం అని కేసీఆర్‌ అబద్ధాలు చెప్పారు. కేవలం 60 శాతం ఉద్యోగులతో ఈ 60 శాతం సర్కార్‌ నడుస్తోంది.  
 ఉద్యోగ పరీక్షలు రాసే లక్షలాది మంది యువత విశ్వాసాన్ని టీఎస్‌పీఎస్సీ కోల్పోయింది.  
 పదో తరగతి నుంచి టీఎస్‌పీఎస్సీ పరీక్షల వరకు నిర్వహణ వైఫల్యంతో 2014–21 మధ్య కాలంలో తెలంగాణలో 3,600 మందికి పైగా యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు.  
జాబ్‌ కేలండర్‌ లేకపోవడంతో ఒకే సమయంలో వివిధ పరీక్షలు నిర్వహించి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు.  
 రూ.4,592 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలుండటంతో వేలాది మంది విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు సరి్టఫికెట్లు, టీసీలు ఇవ్వడం లేదు.
యూనివర్సిటీల్లో 2/3వ వంతు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ వర్సిటీలను నాశనం చేస్తున్నారు. 
కేసీఆర్‌ అసమర్థ పాలనతో యువత మద్యానికి, డ్రగ్స్‌కు, జూదానికి బానిసలవుతున్నారు. వారి భవిష్యత్తు నాశనమవుతోంది.   

మరిన్ని వార్తలు