సాయుధ పోరాటం కమ్యూనిస్టులదే 

12 Sep, 2021 02:50 IST|Sakshi
ర్యాలీలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తదితరులు 

బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది: కె.నారాయణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులదేనని, మతోన్మాద బీజేపీ నాయకులకు దానిపై మాట్లాడే హక్కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయుధ పోరాట యోధుడు మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ విగ్రహం వద్ద 74వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాలు సీపీఐ హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

సభకు సీపీఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ అధ్యక్షత వహించగా నేతలు మఖ్డూమ్‌ మొహియుద్దీన్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర నాయకులు తెలంగాణ చరిత్రను వక్రీకరించి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో అసలు బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా జయప్రదం చేయాలని ప్రజలను నారాయణ కోరారు.

చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతరేకంగా రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్ట్‌ పార్టీ నిర్వహించిందని, ఈ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని అన్నారు. అనంతరం ఎర్ర జెండాలతో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ విగ్రహం వద్ద నుండి అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు