మన లక్ష్యం బీజేపీ విముక్త్‌ భారత్‌

3 Feb, 2024 05:23 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న డి.రాజా

అందుకే ఇండియా కూటమిలో చేరి ఉద్యమిస్తున్నాం 

దేశంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తే విధ్వంసమే 

సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో ప్రధాన కార్యదర్శి డి.రాజా 

సాక్షి, హైదరాబాద్‌: ‘పదేళ్ల బీజేపీ పాలనలో అన్ని వ్యవస్థలు విచ్చిన్నమయ్యాయి..మరోసారి కేంద్రంలో మోదీకి అధికారం ఇస్తే దేశం విధ్వంసమవుతుంది. బీజేపీ విముక్త్‌ భారత్‌ మన లక్ష్యం. ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలి’అని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించడానికే ఇండియా కూటమిలో చేరి ఉద్యమిస్తున్నట్టు ఆయన వివరించారు. మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో భాగంగా శుక్రవారం తొలిరోజు సమావేశంలో డి.రాజా ప్రారంభోపన్యాసం చేశారు.

ప్రజాస్వామ్యదేశంలో అధ్యక్షతరహా పాలన సాగించేందుకు మోదీ ఒకే దేశం.ఒకే ఎన్నిక అనే నినాదం తెరపైకి తీసుకొస్తున్నారన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించేలా ప్రజలను చైతన్యపరచాలని చెప్పారు. మరోసారి మోదీకి అధికారం కట్టబెడితే దేశ భవిష్యత్‌ ఆందోళనకరంగా మారుతుందని వ్యాఖ్యానించారు. దేశాన్ని రక్షించేందుకు ‘దేశ్‌ బచావో.. బీజేపీ హఠావో’అని ఇండియా కూటమి నినాదం ఇచ్చిందని, పార్లమెంట్‌ ఎన్నికల్లో రాజ్యాంగానికి అనుగుణంగా లౌకిక, ప్రజాస్వామ్య విలువలతో పనిచేసే పారీ్టలు గెలవాలని ఆకాంక్షించారు.

భారత్‌ ప్రజస్వామిక దేశంగా ఉంటుందా..లౌకిక గ్రణతంత్రంగా కొనసాగుతుందా? లేదా ఫాసిస్టు, నియంతృత్వ దేశంగా ఉండబోతుందా? అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్నారు. బీజేపీని ఎలా గద్దె దించాలో లౌకిక, ప్రజాతంత్ర పారీ్టలు, శక్తులు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య ఫాసిస్టు, నియంతృత్వ వ్యవస్థ తీసుకొస్తోందన్నారు.  

కార్పొరేట్‌ కంపెనీల కోసమే మోదీ సర్కారు 
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపె ట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పేదల కోసం ఎలాంటి ప్రకటనలు చేయలేదని, కార్పొరేట్‌ సంస్థలకు విధించే పన్నులను 32 శాతం నుంచి 27 శాతానికి తగ్గించారని డి.రాజా అన్నారు. తద్వారా మోదీ ప్రభుత్వం ఎవరి పక్షపాతి అనేది స్పష్టమైందని.. సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ అన్నా, వాస్తవ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మోదీ పాలనలో యువత భవిష్యత్‌ అంధకారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని మోదీ చెబుతున్నారని, అంతర్జాతీయ ఆక లి సూచీలో 125 దేశాల మధ్య భారతదేశం 111వ స్థానంలో ఉండడం ఏమిటని ప్రశ్నించారు. 

మోదీ, గాందీల రాముడు వేర్వేరు 
బీజేపీ రాముడి పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని, మోదీ చెప్పే రాముడు, గాంధీ చెప్పే రాముడికి తేడా ఉందన్నారు. మోదీ హయాంలో మతతత్వ రాజ్యంగా మారుస్తున్నారని, రాజ్యాంగాన్ని, అందులోని మౌలిక సిద్ధాంతాలు, ప్రజాస్వామ్యం, లౌకికవ్యవస్థను కాలరాస్తోందని విమర్శించారు. గత పార్లమెంట్‌ సమావేశాలలో ఎంతమంది ఎంపీలను సస్పెండ్‌ చేశారో అందరికీ తెలుసున్నారు. ప్రజాస్వామ్యం ఉన్నతమైనదని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పార్లమెంటు కళ్లలాంటివని, అలాంటి ప్రతిపక్ష సభ్యులను గత పార్లమెంట్‌ సమావేశంలో సస్పెండ్‌ చేశారని విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుందని, పార్లమెంట్‌ పని చేయకపోతే ప్రజాస్వామ్యం మరణిస్తుందని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పాడన్నారు. సమావేశాలకు రామకృష్ణ పాండా, కూనంనేని సాంబశివరావు, నిషా సిద్ధూలు అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు