యనమల పాత్రపై అనుమానాలు

25 Feb, 2021 04:39 IST|Sakshi

ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా 

తుని రూరల్‌:  తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి సొసైటీలో 61 మంది తొండంగి రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి రూ.11 కోట్లను రుణాలుగా మంజూరు చేయడం వెనుక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా అన్నారు. బుధవారం ఎస్‌.అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో చనిపోయిన 9 మంది సహా 61 మంది రైతుల పేర్లతో నకిలీ పాస్‌ పుస్తకాలు సృష్టించి, పోర్జరీ సంతకాలతో 2016–17లో ఈ సొసైటీలో రూ.11 కోట్లు కాజేశారన్నారు.

ఈ కుంభకోణం వెనుక అప్పటి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు పాత్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనిపై మాజీ మంత్రి యనమల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూస్తున్నట్టు తెలిపారు. ఓ గ్రామంలోనే ఇంతపెద్ద మొత్తంలో అక్రమాలు జరిగితే ఇతర గ్రామాల్లో ఎంతమేరకు అక్రమ రుణాలు పొందారో నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరనున్నట్టు చెప్పారు.  

మరిన్ని వార్తలు