స్పెషల్‌ ఫ్లైట్‌లు రెడీ!

2 Dec, 2023 16:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపడంతో ఆ పార్టీ  ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. తమ పార్టీ తరపున గెలిచే ఎమ్మెల్యేలు చేయి జారిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఫలితాల్లో పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటితే ఎలాంటి సమస్యలు ఉండవు కానీ అలాకాని పక్షంలో ఎమ్మెల్యేల హార్స్‌ ట్రేడింగ్‌ జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్‌ అధినాయకత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పెద్ద స్కెచ్‌నే వేసింది.

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు కొందరు సీఎం కేసీఆర్‌కు టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కేసీఆర్‌ ఎగరేసుకుపోకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలు నడపడంలో దిట్ట అయిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను రంగంలోకి దిగారు. కౌంటింగ్‌కు ఒక రోజు ముందే శనివారం సాయంత్రమే డీకే సహా ఆరుగురు కర్ణాటక మంత్రులు హైదరాబాద్‌ రానున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా  హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణాకు రావాలని డీకే అండ్‌ కో ఇప్పటికే అభ్యర్థులను కోరినట్లు తెలిసింది. అభ్యర్థులతో డీకే ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచాం. ఫలితాల వెల్లడి తర్వాత గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో డీకే బ్యాచ్‌ బెంగళూరు షిఫ్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా,శనివారం ఉదయం తెలంగాణఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ను కలిసిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా గెలవబోయే కాంగ్రెస్‌ అభ్యర్థుల విషయమై ఒక స్పెషల్‌ రిక్వెస్ట్‌ చేశారు. తమ పార్టీ చీఫ్‌ పోలింగ్‌ ఏజెంట్‌కే ఎమ్మెల్యేల గెలుపు ధృవీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. దీనినిబట్టి పోటీచేసిన అభ్యర్థులు లోకల్‌గా అందుబాటులో ఉండరని తేలిపోయింది. 

ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడిన తర్వాత ఓ జాతీయ టీవీ ఛానల్‌తో మాట్లాడిన డీకే శివకుమార్‌ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ ఇప్పటికే మా అభ్యర్థుల్లో కొంత మందికి టచ్‌లోకి వచ్చారని చెప్పారు. అయితే ఈసారి కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను లాక్కోవడం అంత ఈజీ కాదని డీకే స్పష్టం చేశారు.2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఏకంగా లెజిస్లేచర్‌ పార్టీని విలీనం చేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. 

ఇదీచదవండి..తెలంగాణ ఎన్నికలు 2023.. నేటి సమగ్ర సమాచారం   

         

మరిన్ని వార్తలు