జగన్‌ జోలికొస్తే ఊరుకోం..

31 May, 2022 05:17 IST|Sakshi
టెక్కలి వైఎస్సార్‌ జంక్షన్‌లో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌

అవసరమైతే ఆత్మాహుతి దళంగా మారతాం

అచ్చెన్నాయుడు, తెలుగుదేశం నేతలపై ఎమ్మెల్సీ దువ్వాడ ధ్వజం

అధికారంలోకి వస్తే అంతుచూస్తాం అంటారా?

జగన్‌ను తిట్టటానికి, మహిళలతో తొడలు కొట్టించటానికే మహానాడా! అంటూ ఎద్దేవా

టెక్కలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీ నాయకులంతా వారి నోళ్లను అదుపులో పెట్టుకోవాలని, అలా కాకుండా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోలికి ఎవరైనా వస్తే ఆత్మాహుతి దళంగా మారుతానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్సార్‌ జంక్షన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరో దిక్కులేక అచ్చెన్నాయుడును పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే టెక్కలి నియోజకవర్గం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్‌సీపీ నాయకుల అంతు చూస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.

టీడీపీ దృష్టిలో అధికారం అంటే అంతు చూడటం అని మరోసారి ఆ పార్టీ నాయకులే అంగీకరించారని చురకలంటించారు. కేవలం సీఎం వైఎస్‌ జగన్‌ను, ప్రభుత్వాన్ని విమర్శించేందుకే మహానాడును నిర్వహించారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఏ ప్రయోజనం చేకూర్చారో మహానాడులో ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. టీడీపీ మహిళా కార్యకర్తలతో తొడలు కొట్టించటం చూసి మహిళా లోకం సిగ్గుతో తలదించుకుందన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా సింగిల్‌ పేజీ మేనిఫెస్టోతో ప్రజలకు ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశారని గుర్తుచేశారు. మన రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి సైతం కేంద్ర బృందాలు వస్తుండటం సీఎం జగన్‌ సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా కొనసాగుతోందని దువ్వాడ శ్రీనివాస్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు