సీనరేజి వసూళ్లపై వక్రభాష్యం 

12 Feb, 2023 03:56 IST|Sakshi

ప్రభుత్వంపై బురద జల్లేలా ’ఈనాడు’ కథనం 

అత్యంత పారదర్శకంగా సీనరేజి టెండర్లు 

అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో చెక్‌ 

మైనింగ్‌ రెవెన్యూ పెంచేందుకే ప్రైవేట్‌ సంస్థల ద్వారా సీనరేజి వసూళ్లు 

ఇతర రాష్ట్రాల్లోనూ ఈ విధానం అమలులో ఉంది 

సాంకేతిక,  ఆర్థిక అర్హత ఉన్న ఎవరైనా  టెండర్లలో పాల్గొనవచ్చు 

‘ఈనాడు’నూ టెండర్లలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం 

గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి

సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురదచల్లే ఉద్దేశంతోనే ‘ఖనిజాల సీనరేజి వసూళ్లు ప్రైవేటుపరం’ అంటూ ఈనాడు పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని గనుల శాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు పెంచేలా పూర్తి అవాస్తవాలతో అందులోని రాతలు ఉన్నాయంటూ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

అవినీతి, అలసత్వాన్ని పూర్తిగా తొలగించాలనే మంచి ఉద్దేశంతో పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గనుల శాఖలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధానాలతో రాష్ట్రంలో మైనింగ్‌ కార్యక్రమాలు పెరిగాయన్నారు. తద్వారా అటు ప్రభుత్వానికి మైనింగ్‌ రెవెన్యూ, ఇటు పరిశ్రమలకు అవసరమైన ఖనిజాల లభ్యత, పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నా­రు. ఆ ప్రకటనలో ఇంకా ఏం పేర్కొన్నారంటే..  

అధ్యయనం తరువాతే.. 
ఇతర రాష్ట్రాలు చిన్నతరహా ఖనిజాల సీనరేజి వసూళ్లను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వడం ద్వారా మైనింగ్‌ రెవెన్యూలో స్థిరత్వం, పురోగతి సాధిస్తున్నాయి. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమరి్పంచాలని ప్రభుత్వం ఇచి్చన ఆదేశాలతో గనుల శాఖకు చెందిన మైనింగ్‌ అధికారులు రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో పర్యటించి ఈ విధానాన్ని అధ్యయనం చేశారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని నివేదించడంతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీనరేజి వసూళ్ల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఎక్కువమంది టెండర్లలో పాల్గొనేలా నిబంధనలను సరళతరం చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని మైనింగ్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మైనింగ్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలు, జనరల్‌ ఫైనాన్షియల్‌ రూల్స్‌–2017కు అనుగుణంగానే ప్రభుత్వం రిజర్వు ధర, సరళమైన నిబంధనలను అమలులోకి తెస్తూ టెండర్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనలతో నిర్వహించిన టెండర్లలో 5 జిల్లాలకు టెండర్లు ఖరారయ్యాయి. మొదట సాంకేతిక బిడ్‌ను పరిశీలించి అందులో అర్హులైన వారిని మాత్రమే ఫైనాన్షియల్‌ బిడ్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తున్నాం. కోట్‌ చేసిన వాటిలో అధిక మొత్తం నుంచి ఆక్షన్‌ ప్రారంభమవుతుంది. అంతకంటే ఎక్కువ ఎవరైతే కోట్‌ చేస్తారో వారికే టెండర్‌ దక్కుతుంది. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తుంటే ‘ఈనాడు’ పనిగట్టుకుని అబద్ధాలతో ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.  

టెండర్లలో ‘ఈనాడు’ పాల్గొనవచ్చు 
టెండర్లలో బిడ్లు దాఖలు చేసిన సంస్థల అర్హతలను మాత్రమే గనుల శాఖ పరిశీలిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈనాడు పత్రికకు కనీసం ఈ విషయం తెలియకపోవడం బాధాకరం. ఆసక్తి ఉంటే ఈ టెండర్లలో ఈనాడు సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొనవచ్చు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం .

రాష్ట్రంలో ఖనిజాలను రవాణా చేసే వాహనాలను ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులు పర్యవేక్షిస్తూ సీనరేజి వసూళ్లలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి మైనింగ్‌ రెవెన్యూ పెరుగుతుంది. మైనింగ్‌పై పటిష్ట పర్యవేక్షణ కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతి జిల్లాలో ఒక విజిలెన్స్‌ బృందాన్ని నియమించేలా ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇంత మంచి విధానాన్ని అమలు చేస్తుంటే అవగాహన లేకుండా ఈనాడు పత్రిక వక్రీకరణ కథనాలను ప్రచురించడం సరికాదు.   

మరిన్ని వార్తలు