‘ఈనాడు’ రోత రాతలు.. రామోజీ ఇక మారవా?

11 Dec, 2023 10:00 IST|Sakshi

ఒకప్పుడు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా వార్తలు ఇవ్వాలంటే సంపాదకులు ఒప్పుకునేవారు కారు. కాని ఇప్పుడు తమకు గిట్టని ప్రభుత్వం ఉందని ఉగ్రవాద మీడియాగా మారిన ఈనాడు ఎంత నీచానికి అయినా పాల్పడుతోంది. ఏపీ ప్రజలపై రోజూ కక్ష కట్టి ఇలాంటి దారుణమైన వార్తలను ఇవ్వడానికి సిగ్గుపడడం లేదు. తమ అంతేవాసి అయిన చంద్రబాబు నాయుడును మళ్లీ పఠం ఎక్కించాలన్న తాపత్రయంలో ఉచ్చనీచాలు మరిచి రాస్తోంది. టీవీలో ప్రచారం చేస్తోంది. రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య అంటూ కొద్ది రోజుల క్రితంం ఇచ్చిన వార్త చదివితే కడుపు మండుతుంది.

✍️ఏపీ ప్రజల మీద ఇంతలా ఈనాడు రామోజీరావు పగ పట్టాలా అన్న ఆవేదన కలుగుతుంది. ఎల్లో మీడియాగా, ఎల్లో జర్నలిజంగా వస్తున్న విమర్శలను ఆయన సార్ధకం చేసుకుంటున్నారు. నిజానికి కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం ఏపీలో నిరుద్యోగుల సంఖ్య తగ్గుతోంది. చంద్రబాబు పాలన టైమ్‌లో ప్రతి వెయ్యి మందికి నలభై ఐదు మంది నిరుద్యోగులు ఉంటే, వైఎస్ జగన్ పాలనలో అది 33కి తగ్గింది. ఈ వార్త రావడంతోనే ఈనాడు మీడియాకు కడుపు ఉబ్బి పోయింది. ఎలా దీనిని చెడగొట్టాలని ఆలోచించింది. వెంటనే ఓ కథ అల్లేసింది.

✍️దేశ వ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యలపై కేంద్రం ఏదో నివేదిక ఇచ్చిందంటూ దాని ప్రకారం 364 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని అంటే ప్రతి రోజూ ఒక నిరుద్యోగి ఇలా చనిపోయారని అంటూ రాసేసింది. అంతేకాదు. పరిశ్రమలు తరిమేస్తున్నారట. అమరావతిని వదలివేశారట. ఇలా ఏవేవో అసత్యాలతో  అతి దారుణమైన కథనాన్ని వండి వార్చారు.  ప్రభుత్వపరంగా వైఎస్ జగన్ వచ్చాక ఇచ్చిన ఉద్యోగాలు దేశ చరిత్రలోనే ఒక రికార్డు. ఒకేసారి లక్షాపాతికవేల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ఒక్క జగన్ దే.

✍️దమ్ముంటే ఈనాడు మీడియా చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలన టైమ్‌లో కాని, అంతకుముందు ఎన్.టి.ఆర్.పాలించిన ఏడేళ్ల టైమ్ లో కాని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు ఇవ్వాలి. గత టరమ్‌లో చంద్రబాబు టైమ్ లో ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ కలిపి ఏభై వేలు లేకపోయినా, ఆయన నిరుద్యోగ సమస్యను తీర్చేశారని ఈనాడు రామోజీరావు బిల్డప్ ఇచ్చేస్తున్నారు. అసలు చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగాలకు వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే.

✍️ఆయన హయాంలోనే ఏభైనాలుగు కార్పొరేషన్‌లను మూసివేశారు. వాటిలో పనిచేసే ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి  పంపించేశారు. ఆ సంగతి జనం మర్చిపోతారన్నది వారి నమ్మకం. జగన్ టైమ్ లో వివిధ రకాల ఉద్యోగాలు అన్నీ కలిపి రెండు లక్షలకు పైగా ఇచ్చినా అసలేమీ ఇవ్వలేదన్నట్లు పచ్చి అబద్దపు వార్తలను సృష్టిస్తున్నారు.ఇక వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి నెలకు ఐదువేల రూపాయల చొప్పున ఇస్తున్నది కూడా జగన్ ప్రభుత్వమే. తద్వారా ఎవరైనా ఇంకా ఉద్యోగం రాని వారికి ఒకపక్క ప్రజలకు సేవ చేస్తూ ,మరో వైపు ఇది భృతిగా ఉపయోగపడుతోంది. ఇలా సుమారు ఇంకో  రెండున్నర లక్షల మందికి మేలు కలుగుతోంది.

✍️చంద్రబాబు నాయుడు టీడీపీ మానిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు రెండువేల రూపాయల చొప్పున భృతి ఇస్తానని నాలుగున్నరేళ్లపాటు ఇవ్వకుండా మోసం చేసినా, రామోజీరావు, వారి సంపాదక బృందానికి, విలేకరులకు కనిపించనే కనిపించదు. వారు అప్పుడు కళ్లు మూసేసుకున్నారు. ఈ మధ్య కేటీఆర్ ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువత కొందరితో భేటీ అయ్యారు. ఆంధ్రలో రెండుసార్లు గ్రూప్ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తే తెలంగాణలో మాత్రం ఒక్కటి కూడా చేయలేదని ఒక యువతి చెప్పినప్పుడు దానిని ఆయన అంగీకరించిన సంగతి ఈనాడుకు వినిపించి ఉండదు. ఆరోగ్య శాఖలో సుమారు నలభై వేల పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి వీరికి పట్టదు.

✍️ఎస్.ఐ.తదితర పోలీసు ఉద్యోగాలను ఎంపికలు జరుగుతున్న సంగతి హైకోర్టు సాక్షిగానే తెలిసింది కదా! అయినా రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ ఈనాడు నీచంగా రాస్తూ యువత పట్ల పాపం చేస్తోంది. ఈ మధ్యనే ఒక యువకుడు సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్య చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం తలపెట్టడం ద్వారా తనకు ఉద్యోగం వచ్చిందని, అందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ధాంక్స్ అని పేర్కొన్నాడు. అక్కడ సుమారు రెండుఉవేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. అలా మరో మూడు పోర్టుల నిర్మాణం జరుగుతోంది. విశాఖలో అనేక  పరిశ్రమలు వస్తుంటే, ఐటి కంపెనీలు వస్తుంటే ఈనాడు కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది.

✍️అక్కడ వాటిని ఎలా పాడు చేయాలా? వారు రాకుండా ఎలా భయపెట్టాలా అని చంఢాలపు కథనాలు ఇస్తోంది. కేవలం ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకునేవారు చాలా తక్కువ ఉంటారు. వారి ఆత్మహత్యలకు వేరే కారణాలు ఉండవచ్చు. ఇలాంటి ఘటనలను ఒక్కొక్కటి పరిశీలించి రాస్తే ఫర్వాలేదు. కాని గంపగుత్తగా ప్రభుత్వం మీద బురద చల్లే లక్ష్యంతో ఇష్టారీతిన రాసేస్తూ, పైగా తమకు స్వేచ్చ లేదని తప్పుడు ప్రచారం చేస్తోంది. గత కొద్ది నెలల్లోనే సుమారు అరవైవేల కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటైతే వాటి గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు, ఇలాంటి అబద్దాలను ప్రజలపై రుద్ది వారి మనసులను కలుషితం చేయాలని విశ్వయత్నం చేస్తోంది. అందుకే ఈనాడు మీడియా ఉగ్రవాద సంస్థ మాదిరే తయారైందన్న వాదనలో వాస్తవం ఉందనిపిస్తుంది.

✍️దేశవ్యాప్తంగా 15783 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో 2.3 శాతం ఎపివారని, వైకాపా పాలన రికార్డు అని రాసింది. బీహారు, బెంగాల్ లో నిరుద్యోగుల ఆత్మహత్యలు తక్కువని లెక్కలు చెబుతున్నాయట.ఆత్మహత్యలు తక్కువ ఉంటే  నిరుద్యోగం లేనట్లేనా? ఆ రాష్ట్రాల యువత పెద్ద సంఖ్యలో తెలంగాణ, ఏపీలోని వివిధ పట్టణాలలో చిన్న, చిన్న పనులు చేసుకుని ఎందుకు బతుకుతోంది. తెలంగాణలో ఆత్మహత్యల పరిస్థితి, నిరుద్యోగ శాతం ఎంత పెరిగిందో కూడా కేంద్ర నివేదికలలో ఉంటుంది కదా! దాని గురించి ఎందుకు రాయలేదు? కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి నిరుద్యోగ సమస్య కూడా ఒక కారణం కాదా?. టీపీపీఎస్సీ లో జరిగిన గందరగోళం గురించి ఎన్నడైనా ఈ పత్రిక ధైర్యంగా కేసీఆర్‌ను విమర్శిస్తూ వార్తలు ఇచ్చిందా?

✍️ఏపీలో అసలు ఉద్యోగాలే లేనట్లు, పరిశ్రమలే రానట్లు ఈనాడు గుడ్డిగా రాసినంత మాత్రాన ప్రజలంతా గుడ్డివాళ్లుగా ఉండరు. పుంగనూరులో నాలుగువేల కోట్లతో విద్యుత్ బస్ ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్దం అవుతుంటే దానిని చెడగొట్టడానికి ఈనాడు ఎంతలా ప్రయత్నిస్తోంది కనిపించలేదా? అక్కడ కొద్ది మంది రైతులు తమ భూములు ఇవ్వబోమని చెబుతున్నారట. అయినా ప్రభుత్వం వారినుంచి స్వాధీనం చేసుకుంటోందని ఇదే పత్రిక రాసింది.

✍️పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎలా రాకుండా చేయాలా అని భూములు ఇవ్వకుండా ప్రజలను రెచ్చగొట్టాలని  ఒక వైపు, పరిశ్రమలు రావడం లేదని మరో వైపు ప్రచారం చేస్తూ ఈనాడు నికృష్టమైన రీతిలో వ్యవహరిస్తోంది. డిసెంబర్ ఆరో తేదీ ఈనాడు మొదటి పేజీ చూస్తే ఆ పత్రిక ఎంత రోతగా తయారైంది అర్ధం అవుతుంది. పోలవరం ప్రాజెక్టుకు 31 వేల కోట్ల రూపాయల అంచనాకు కేంద్రం ఒకే చేస్తే దాని గురించి రాయకుండా, ఎవరో అధికారి ఏదో అన్నారని పెద్ద అక్షరాలతో ఎల్లో మీడియా రాస్తుంది. నిత్యం ఈనాడుది ఇదే రొద, ఇదే సొద. వీటన్నిటికి ప్రభుత్వం సిద్దపడాల్సిందే. ఎందుకంటే నిజంగానే ఈనాడు తదితర ఎల్లో మీడియా వారు  దుష్టులుగా మాత్రమే  కాదు.. ఏపీ ప్రజలకు శత్రువులుగా మారారు కనుక.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

ఇదీ చదవండి: దిగజారుడు అబద్ధాన్ని జనం నమ్ముతారనేనా!

whatsapp channel

మరిన్ని వార్తలు