సాక్షి మనీ మంత్ర: 21,000 మార్కును తాకిన నిఫ్టీ సూచీ

11 Dec, 2023 09:56 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 128 పాయింట్లు లాభపడి 69,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 23 పాయింట్లు ఎగబాకి 20,992 వద్దకు చేరింది. ఒకానొక సమయానికి నిఫ్టీ సూచీ 21,000 మార్కును తాకింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారక విలువ రూ.83.39 దగ్గర ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, ఎంఅండ్‌ఎం, టైటన్‌, విప్రో, మారుతీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గతవారం లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం అదే బాటలో పయనించాయి. ప్రస్తుతం అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు చైనాలో నవంబర్‌ నెల ద్రవ్యోల్బణం తగ్గడంతో ఆసియా-పసిఫిక్‌ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.3,632 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.434 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశం (ఈనెల 12-13 తేదీల్లో) నుంచి ఈ వారం మార్కెట్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లపై ఫెడ్‌ తీసుకునే నిర్ణయం కీలకం కానుందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు