రూ. 2 వేల కోట్లకు పైగా మోసం కేసులో సినీ నటుడు

11 Dec, 2023 10:18 IST|Sakshi

తమిళనాడులో ఆరుద్రా గోల్డ్‌ పెట్టుబడుల విషయంలో రూ. 2,438 కోట్లకు పైగా మోసాలకు పాల్పడిన ఘటన కొన్ని నెలల క్రితం సంచలనం రేపింది. ఈ కేసులో కోలీవుడ్‌ నటుడు ఆర్కే సురేష్‌కు కూడా సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని నెలల అనంతరం దుబాయ్‌ నుంచి చైన్నెలో ఆర్కే సురేష్‌ అడుగు పెట్టాడు. ఆయన్ని అధికారులు విమానాశ్రయంలో ప్రశ్నించారు.  ఆర్థిక నేర విభాగం పోలీసుల విచారణకు నేడు హాజరు కానున్నట్టు సురేష్‌ వెల్లడించారు. 

వివరాలు.. చైన్నె కేంద్రంగా రాష్ట్రంలో ఆరుద్రా గోల్డ్‌ పెట్టుబడుల పేరిట రూ. 2,438  కోట్లకు పైగా మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితులను ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద జరిపిన విచారణలో బీజేపీ నేతల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఆరుద్రా గోల్డ్‌లో డైరెక్టర్లుగా ఉన్న వాళ్లు బీజేపీకి చెందిన వారుగా తేలడంతో విచారణ వేగం పుంజుకుంది. అదే సమయంలో ఈ కేసుతో సినీ నటుడు ఆర్కే సురేష్‌కు సంబంధాలు ఉన్నట్టు వెలుగు చూశాయి. దీంతో ఆయన్ని విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు.

అయితే విదేశాలలో షూటింగ్‌ బిజి పేరిట ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. కొన్ని నెలల పాటు ఆయన విదేశాలలోనే ఉండి పోయారు.ముందస్తు బెయిల్‌ ప్రయత్నాలు, ఈ కేసుతో తనకు సంబంధం లేదని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలను చేశారు. చివరకు ఆయనకు వ్యతిరేకంగా లుక్‌ అవుట్‌ నోటీసును చైన్నె ఆర్థిక నేర విభాగం పోలీసులు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో కొన్ని నెలల అనంతరం దుబాయ్‌ నుంచి చైన్నెకు సురేష్‌ వచ్చారు. 

చైన్నె విమానాశ్రయంలో అడుగు పెట్టిన ఆయన్ను ఇమిగ్రేషన్‌ అధికారులు విచారణ జరిపారు. తాను చైన్నె ఆర్థిక నేర విభాగం పోలీసుల విచారణకు హాజరయ్యేందుకే ఇక్కడకు వచ్చినట్టు వారికి వివరించారు. విచారణ అనంతరం చైన్నెలోకి ఆయన్ని అనుమతించారు. విమానాశ్రయం నుంచి తన ఇంటికి చేరుకున్న ఆర్కే సురేష్‌ డిసెంబర్‌ 12న  చైన్నె ఆర్థిక నేర విభాగం పోలీసుల విచారణకు హాజరవుతారు.

ఎవరీ ఆర్.కె. సురేష్‌
ఆర్.కె. సురేష్ సినీ నిర్మాత, సినిమా నటుడు. ఆయన స్టూడియో 9 నిర్మాణ సంస్థకు అధిపతి. సురేశ్ 2015లో తారై తప్పట్టై సినిమా ద్వారా నటుడిగా అరంగ్రేటం చేశాడు. ఆయన ప్రస్తుతం తమిళనాడు బీజేపీ ఒబిసి విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయన పలు సినిమాలకు భాగం పంచుకున్నాడు. తెలుగులో విశాల్‌ రాయుడు చిత్రంతో పాటు విక్రమ్‌ స్కెచ్ మూవీలో కనిపించాడు. ఆపై కాశి, రాజా నరసింహా చిత్రాల్లో మెప్పించాడు.

>
మరిన్ని వార్తలు