ఓబీసీ నేతల జంప్‌.. కీలకంగా మారిన కేశవ్‌ ప్రసాద్‌.. యోగి లేకుంటే సీఎం అయ్యేవారే!

25 Jan, 2022 10:49 IST|Sakshi

ఓబీసీ నేతల ఫిరాయింపులతో.. బీజేపీకి పెద్దదిక్కుగా 

డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌ మౌర్య 

2017 ఎన్నికల్లో ఆయన సారధ్యంలోనే బీజేపీ అధికార పీఠంలోకి 

ఇప్పుడు ఓబీసీల్లో ఆయన ఛర్మిష్మానే నమ్ముకున్న బీజేపీ 

సొంత నియోజకవర్గం సిరాత్‌ నుంచి బరిలోకి 

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో కాషాయ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న ఓబీసీ నేతలు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వేళ... సామాజిక సమీకరణాలు మారకుండా చూసుకునేందుకు పార్టీ నమ్ముకున్న ఏకైక వ్యక్తి ‘కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య’. ఐదేళ్ల కిందట యూపీ పీఠాన్ని అధిరోహించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముందుండి నాయకత్వం వహించిన ఆయనే ప్రస్తుత ఎన్నికల్లో పార్టీకి పెద్దదిక్కుగా మారారు.

ఓబీసీల్లో బలమైన పట్టున్న కేశవ్‌ప్రసాద్‌నే ప్రధాన ముఖంగా పెట్టి ఎన్నికలను ఢీకొనే కార్యాచరణను తీసుకోవడంతో ఆయన ప్రాధాన్యం మరింత పెరిగింది. 2017లోనే ముఖ్యమంత్రి పదవికి ఆయన బలమైన పోటీదారుగా ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా యోగి ఆదిత్యనాథ్‌ తెరపైకి రాగా, ఈ మారు మాత్రం మౌర్యను సీఎంగా చూడాలనుకుంటున్న నేతల సంఖ్య గణనీయంగా పెరగడం ఆయన ఛరిష్మాను చెప్పకనే చెబుతోంది.  
(చదవండి: స్కూలు విద్యార్థి ఆత్మహత్య కేసులో దోషుల్ని విడిచిపెట్టం)

సంఘ్‌ నుంచి డిప్యూటీ దాకా... 
యూపీలో అధికంగా ఓబీసీ వర్గాలకు చెందిన వారు 42 శాతం వరకు ఉండగా,  వర్గాల్లో అధిక పట్టు కలిగిన వర్గంగా మౌర్యాలు ఉన్నారు. మౌర్య వర్గానికి చెందిన కేశవ్‌ ప్రసాద్‌కు తొలినుంచి జన్‌సంఘ్‌ బజ్‌రంగ్‌దళ్‌తో అనుబంధం ఉంది, గోసంరక్షణ, రామజన్మభూమి ఉద్యమాల్లో పాల్గొన్న కేశవ్‌ప్రసాద్‌ అనంతరం బీజేపీలో చేరి వివిధ విభాగాల్లో పనిచేశారు. అనంతరం 2002, 2007లో సిరతు నియోకవర్గం నుంచి ఓడిన కేశ్‌ప్రసాద్‌ తదనంతరం 2012లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

అనంతరం 2014 ఎన్నికల్లో పుల్పూర్‌ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండగా, దాన్ని బద్ధలు కొట్టడంతో ఈయన పేరు అందరికీ తెలిసింది. అనంతరం 2016లో సంఘ్‌ జోక్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల నాయకత్వ బాధ్యతలను పూర్తిగా తనపై మోసిన కేశవ్‌ప్రసాద్‌ ఏకంగా 200 ర్యాలీలు చేపట్టి 312 సీట్లు రావడంలో కీలకపాత్ర పోషించారు.

ఈ సమయంలోనే కేశవ్‌ప్రసాద్‌ను సీఎంను చేస్తారని అంతా భావించినా అనూహ్యంగా యోగి తెరపైకి రావడంతో ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక చేసి డిప్యూటీ సీఎం చేశారు. పీడబ్ల్యూడీ మంత్రిగా యూపీ అభివృధ్ధిలో తనదైన ముద్ర వేసిన కేశవ్‌ప్రసాద్‌ తనకిచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఇద్దరు ఓబీసీ మంత్రులు స్వామి ప్రసాద్‌ మౌర్య, ధారాసింగ్‌ చౌహాన్‌లు పార్టీని వీడటంతో పార్టీ ఒక్కసారిగా ఖంగుతింది. ఈ సమయంలో కేశవ్‌ప్రసాద్‌ మౌర్య అత్యంత కీలకంగా వ్యవహరించి, మరింతమంది ఓబీసీ నేతలు జారిపోకుండా చర్యలు చేపట్టారు.

అదీగాక సమాజ్‌వాదీ పార్టీలో బలంగా ఉన్న యాదవేతర నేతలు బీజేపీలో చేరేలా కృషి చేశారు. దీంతో పాటే పార్టీ మిత్రపక్షాలు, అప్నాదళ్, నిషాద్‌ పార్టీలతో కేశవ్‌ మౌర్యకు ఉన్న మంచి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఆయనకు సీట్ల సర్దుబాటుకు ప్రధాన అనుసంధాన కర్తగా పెట్టింది. ఆయన వల్లే సీట్ల సర్దుబాటు అంశం సాఫీగా సాగిందనే భావన ఉంది. ఇక ఆయను ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేయించే అంశమై చర్చోపచర్చలు జరగ్గా, తన సొంత నియోకవర్గం సిరాతు నుంచి పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపారు. ఈ స్థానంలో సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యే శీతలా ప్రసాద్‌ సైతం కేశవ్‌ప్రసాద్‌కు సిరాత్‌ టిక్కెట్‌ కేటాయించడాన్ని స్వాగతించారు. తన గురువు కోసం సీటును త్యాగం చేయడం తనకేబి ఇబ్బందిగా లేదని ప్రకటించిందంటే కేశవ్‌ప్రసాద్‌పై లాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చు.  
(చదవండి: ఆయనొక క్రౌడ్‌ పుల్లర్‌.. మాటలు తూటాల్లా పేలుతాయ్‌..)

మరిన్ని వార్తలు