పేదలను దోచుకున్నోళ్లే... నన్ను తిడుతున్నారు: ప్రధాని మోదీ

3 Dec, 2022 05:41 IST|Sakshi
కాంక్రేజ్‌లోని ఔగర్‌నాథ్‌ ఆలయంలో మోదీ పూజలు

అవినీతికి చరమగీతం పాడడం వారికి నచ్చట్లేదు 

గుజరాత్‌ ప్రచారంలో కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం

అహ్మదాబాద్‌: ‘‘ఆటంక్, లట్‌కానా, భట్కానా (అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడం)... కాంగ్రెస్‌ నమ్ముకున్న సూత్రం ఇదే’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పేదలను లూటీ చేసినవారు తనను దూషిస్తున్నారని చెప్పారు. అవినీతికి చరమగీతం పాడినందుకు నిత్యం తిడుతున్నారని ఆక్షేపించారు.

గతంలో గుజరాత్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవినీతికి ఆస్కారమున్న పనులు తప్ప ప్రజలకు మంచి చేసే పనులు చేయలేదని ఆరోపించారు. మోదీ శుక్రవారం గుజరాత్‌లో బనస్కంతా జిల్లా కాంక్రేజ్‌ గ్రామంలో ఎన్నికల సభలో ప్రసంగించారు. కరువు పీడిత ప్రాంతాలకు నర్మదా జలాలను తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ నిర్మాణానికి కాంగ్రెస్‌ అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు.

పేదలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవు  
కాంగ్రెస్‌ పాలనలో దేశంలో మధ్యలో వదిలేసిన 99 తాగునీటి సరఫరా పథకాలను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 4 లక్షల నకిలీ రేషన్‌ కార్డులను రద్దు చేశామన్నారు. అవినీతి అడ్డుకోవడం కొందరికి నచ్చడం లేదని, అందుకే తనను దూషిస్తున్నారని వ్యాఖ్యానించారు. పేద ప్రజలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పుడు పనులు చేసి దొరికిపోయినవారు తనను తిడుతున్నారని చెప్పారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోబీజేపీ మరోసారి విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు. కాంక్రేజ్‌లోని ఔగర్‌నాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.  

కాంగ్రెస్‌ నేతల బానిస మనస్తత్వం  
స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌ పాలకులతో కలిసి పనిచేసిన కాంగ్రెస్‌ నేతలు బానిస మనస్తత్వాన్ని అలవర్చుకున్నారని మోదీ చెప్పారు. బ్రిటిషర్ల చెడు అలవాట్లను కాంగ్రెస్‌ నాయకులు నేర్చుకున్నారని తెలిపారు.

ఆనంద్‌ జిల్లాలోని సోజిత్రా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్‌ సమస్య కేవలం సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ మాత్రమే కాదని, దేశ ఐక్యత కూడా అని చెప్పారు. విభజించు, పాలించు అనే విధానంపైనే కాంగ్రెస్‌ రాజకీయాలు ఆధారపడి ఉంటాయన్నారు. ప్రజలందరినీ ఏకం చేయాలని సర్దార్‌ పటేల్‌ భావించారని, అందుకే ఆయనంటే కాంగ్రెస్‌కు గిట్టదని పేర్కొన్నారు.   

బీజేపీ విజయాన్ని ఒప్పుకున్న కాంగ్రెస్‌   
గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (ఈవీఎం) ట్యాంపరింగ్‌ చేశారన్న కాంగ్రెస్‌ ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. ‘‘ఓటమి తప్పదని కాంగ్రెస్‌ నిర్ణయానికి వచ్చింది. అందుకే ఈవీఎంలపై నిందలు మోపుతోంది. తద్వారా బీజేపీ విజయాన్ని పరోక్షంగా అంగీకరించింది’’ అని అన్నారు. ఆయన ఉత్తర గుజరాత్‌లోని పఠాన్‌ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ముందు మోదీని తిట్టడం, ఎన్నికలయ్యాక ఈవీఎంలను నిందించడం.. కాంగ్రెస్‌కు తెలిసింది ఈ రెండు విషయాలేనని ఎద్దేవా చేశారు. దేశంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పేదలకు దక్కాల్సిన సొమ్మును దోచుకున్నాయని దుయ్యబట్టారు. ధనికుల, పేదల మధ్య అంతరాలు పెంచిన ఘనత కాంగ్రెస్‌దేనని ధ్వజమెత్తారు.  

మరిన్ని వార్తలు