రసవత్తరంగా ఉమ్మడి కరీంనగర్‌ పోరు

5 Nov, 2023 21:06 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో ఆపరేషన్ ఆకర్ష జోరుగా సాగుతోంది. అటు అధికార పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి జంపింగ్‌ జపాంగ్‌లు అటు ఇటూ గెంతుతున్నారు. చేరికల కారణంగా రాజకీయ వాతావరణం జిల్లాలో రసవత్తరంగా మారుతోంది. అయితే ఈ దూకుళ్ళు..చేరికల వల్ల లాభం ఎవరికి? నష్టం ఎవరికి? లేదంటే లాభనష్టాలు లేని చేరికలా? అసలు కరీంనగర్‌లో ఏంజరుగుతోంది. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారు స్పీడ్‌కు బ్రేకులు వేసి మంథని నియోజకవర్గంలో హస్తం పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీధర్‌బాబు నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. మంథని నియోజకవర్గంలోని ఏదో ఒక మండలం నుంచి నిత్యం కనీసం రెండొందల మంది నుంచి వెయ్యి మంది వరకూ కార్యకర్తలు చేరుతుండటంతో.. కాంగ్రెస్ లో సమరోత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో శ్రీధర్‌బాబు మీద ఒకింత అలకతో వెళ్లిపోయిన నేతలు సైతం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో.. మంథని కాంగ్రెస్ లో సందడి వాతావరణం కనిపిస్తోంది. అయితే, మంథని నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీధర్ బాబు ప్రచారంలో లేకపోయినా.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా బిజీబిజీగా హైదరాబాద్, ఢిల్లీ, ఒక్కోసారి బెంగళూరు వంటి చోట్లకు తిరుగుతున్నా.. మంథనిలోని ఇతర ముఖ్య నాయకుల సమక్షంలో..ముఖ్యంగా శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబు సమక్షంలో ఈ చేరిక ప్రక్రియ ఓ నిరంతర కార్యక్రమంలా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తున్న హవా.. ప్రజలందరికీ అనుకూలంగా కనిపిస్తున్న మేనిఫెస్టోతోనే కాంగ్రెస్ లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని నాయకులు చెబుతున్నారు.

అయితే, ఇదే పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపెల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ప్రచారం ఇప్పటివరకూ జరిగినా.. కాంగ్రెస్ లోకి వెళ్లిన కీలక నేతలుగా ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ బాట పడుతున్నారు. ఇప్పటికే సత్యనారాయణ రెడ్డితో పాటు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి వంటివారంతా తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. దీంతో మంథనికి భిన్నంగా ఇక్కడ బీఆర్ఎస్ లోకి చేరికలు కనిపించడం.. కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలతో కొందరు బీఆర్ఎస్ తో పాటు.. బీజేపీ బాట పడుతుండటం వంటివి తమకు కలిసొచ్చే అంశాలుగా అధికార బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

మరొకవైపు గులాబీబాస్ ఫోకస్డ్ గా ఉన్న ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటైన హుజూరాబాద్ లోనూ పాడి కౌశిక్ రెడ్డి పగ్గాలు చేపట్టాక... పెద్దఎత్తున బీఆర్ఎస్ లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటి నుంచే ఏ గ్రామంలో, ఏ తాండాలో, ఏ హ్యామ్లెట్ విలేజ్ లో ఎంత మంది ఓటర్స్ ఉన్నారు.. వారికి బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఎలా వివరించాలన్న పక్కా లెక్కలతో కౌశిక్ రెడ్డి ఉదయం నుంచీ రాత్రి వరకూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో పనిచేస్తుండటంతో.. హుజూరాబాద్ లో బీఆర్ఎస్ లో ఇప్పుడు కొత్త జోష్ కనిపిస్తోంది. గత ఉపఎన్నికల్లో వర్కౌటైన సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితులుంటాయా అన్న చర్చ నేపథ్యంలో.. ఇప్పుడు కౌశిక్ దూకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఈటలతో పాటు.. కొత్తగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగబోతున్న ఒడితెల ప్రణవ్ బాబుకు కూడా ఓ సవాల్ వంటిదే.

ఇక కరీంనగర్ లోనూ గంగుల కమలాకర్ తిరుగులేని నేతగా ఎదిగిన క్రమంలో.. నిత్యం చేరికల పర్వం కనిపిస్తోంది. కరీంనగర్ కార్పోరేషన్ లో ఐదుగురు కార్పోరేటర్లు బీజేపీకీ గుడ్ బై చెప్పి.. గంగుల నేతృత్వంలో కారెక్కేందుకు సిద్ధం అయ్యారు. ఈనేపథ్యంలో కరీంనగర్ లో కొత్తగా వచ్చి చేరేవారితో కారు ఫుల్లైపోతోంది. అయితే దీంతో బీఆర్ఎస్ లో కొత్త జోష్ కనిపిస్తుండగా.. వెళ్లిపోతున్నవారిని ఎలా అడ్డుకోవాలో తెలియక బీజేపీ సతమతమవుతోంది. ఇంకా అభ్యర్థినే ప్రకటించని నేపథ్యంలో.. ఇక కాంగ్రెస్ గురించి పెద్దగా ఇప్పటికైతే చెప్పుకోవాల్సిన పనే లేకుండా పోయింది. ఇక ఇదే పరిస్థితి చొప్పదండిలోనూ మనకు కళ్లకు కడుతోంది. బీఆర్ఎస్ పథకాలు.. నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఖర్చు ఎంత పెట్టామో చెబుతూ స్థానికంగా తయారుచేసిన మేనిఫెస్టోలో 18 వందల కోట్ల రూపాయల నిధుల వెచ్చింపుపై జనం ఆకర్షితులవుతున్నారు. గతంలో కనివినీ ఎరుగని రీతిలో చొప్పదండి నియోజకవర్గంలో మోతె వాగు ద్వారా 30 వేల ఎకరాలకు నీరందుతుండటం.. అభివృద్ధి కళ్లకు కడుతుండటంతో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ నుంచి కార్యకర్తల వలసలు పెరిగి బీఆర్ఎస్ కేడర్‌లో నూతనోత్సాహం వెల్లి విరుస్తోంది.

మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు సెగ్మెంట్లలో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలే.. ఇతర పార్టీల నేతలను, కార్యకర్తలను ఆయా పార్టీల్లోకి తీసుకువస్తున్నాయనే టాక్ నడుస్తోంది. అయితే, ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలా అన్న యోచనలో నష్టపోతున్న పార్టీలు పట్టించుకోకపోవడం, లైట్ గా తీస్కుంటుండటంతో.. ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదనే చర్చ ఆయా పార్టీల్లోనే అంతర్గతంగా జరుగుతోంది. 
 

మరిన్ని వార్తలు