Etela Rajender: భవిష్యత్‌ వ్యూహరచనపై వడివడిగా అడుగులు

12 May, 2021 12:50 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భవిష్యత్‌ రాజకీయం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. భూకబ్జా ఆరోపణలు, మంత్రి పదవి నుంచి ఆయనను బర్తరఫ్‌ చేసిన నేపథ్యంలో ఈటల తన రాజకీయ వ్యూహరచనలో నిమగ్నం అయ్యారు. తాజాగా ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌తో బుధవారం భేటీ అయ్యారు. డీఎస్ నివాసంలో సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు.

ఈ భేటీలో తండ్రి డీఎస్‌తో పాటు బీజేపీ ఎంపీ అరవింద్‌ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలతో ఈటల భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈటల రాజేందర్‌.. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడైన డీఎస్‌తో భేటీ కావటం రాజకీయంగా చర్చనీయ అంశంగా మారింది. ఇక గత కొన్ని రోజులుగా డీఎస్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ పరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ ఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఈటల మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌తో కూడా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డితో కూడా భేటీ కావాలని ఈటల యోచిస్తున్నట్టు సమాచారం. ఇక తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి.. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయటంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఈటల ఇటీవల పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

చదవండి: ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానం

మరిన్ని వార్తలు