‘కమలం’ చెంతకు కమల్‌నాథ్‌?

18 Feb, 2024 04:55 IST|Sakshi

కుమారుడు సైతం పార్టీ మారొచ్చంటూ పుకార్లు

కొట్టిపారేసిన మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ/భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని కమల్‌నాథ్‌ ఆ వార్తలను కొట్టిపారేశారు. అయితే శనివారం జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషణలు వినవచ్చాయి.  

అసలేం జరిగింది?
కమల్‌నాథ్‌కు మాజీ మీడియా సలహాదారు, ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి అయిన నరేంద్ర సలూజా.. కమల్‌నాథ్, ఆయన కుమారుడు, ఛింద్వారా కాంగ్రెస్‌ ఎంపీ నకుల్‌నాథ్‌లతో దిగిన భోపాల్‌లో దిగిన ఒక ఫొటోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేసి దానికి ‘జై శ్రీరామ్‌’ అని ట్వీట్‌చేశారు. దీంతో తండ్రీకొడుకులు కమలం గూటికి చేరుకుంటున్నారని వార్తలు మొదలయ్యాయి. వీటికి బలం చేకూరుస్తూ నకుల్‌నాథ్‌ తన ‘ఎక్స్‌(పాత ట్విట్టర్‌)’ ఖాతా వివరాల్లో కాంగ్రెస్‌ పదాన్ని తొలగించారు. ముందస్తు షెడ్యూల్‌ లేకుండా హడావుడిగా ఇద్దరూ ఢిల్లీకి వచ్చారు. రాగానే మీడియా కమల్‌ను ప్రశ్నించింది.

మీరు పార్టీ మారుతున్నారా? అన్న ప్రశ్నకు ‘‘ అలాంటిదేమైనా ఉంటే ముందు మీకే చెబుతా’ అని అన్నారుగానీ పార్టీని వీడట్లేదనే సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజ్యసభ సీటు ఆశించి భంగపడినందుకే కమల్‌నాథ్‌ పార్టీని వీడుతున్నారని మరో విశ్లేషణ వినిపించింది. బీజేపీలోకి వస్తామంటే ఇప్పుడే మీకు స్వాగతం పలుకుతామని మధ్యప్రదేశ్‌ బీజేపీ చీఫ్‌ వీడీ శర్మ శుక్రవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. గత ఏడాది మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు కమల్‌నాథ్‌ బాధ్యుడని రాహుల్‌ భావిస్తున్నారని, అందుకే కమల్‌ను తప్పించి జీతూ పట్వారీకి కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌ చీఫ్‌ పదవి కట్టబెట్టారని వార్తలొచ్చాయి.  

అన్నీ అసత్యాలు : జీతూ పట్వారీ
ఇలాంటి వార్తలను కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌ అధ్యక్షుడు జీతూ పటా్వరీ తోసిపుచ్చారు. ‘‘ కాంగ్రెస్‌తో కమల్‌నాథ్‌ బంధం ఈనాటిది కాదు. ఇందిరాగాంధీ తనయుడు సంజయ్‌ గాంధీతో కలిసి డెహ్రాడూన్‌ డూన్‌ స్కూల్‌లో చదివారు. ఒకానొక సమయంలో కమల్‌ నా మూడో కుమారుడు అంటూ స్వయంగా ఇందిరగాం«దీనే వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌ను వీడుతారా?’’ అని మీడియానే పట్వారీ నిలదీశారు. ‘‘రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నది అవాస్తం.

నిజానికి ఆ స్థానం కోసం నామినేషన్‌ వేసిన పార్టీ కోశాధికారి అశోక్‌సింగ్‌ పేరును బలపరిచింది కమల్‌నాథే’’ అని పటా్వరీ వివరణ ఇచ్చారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో అనుబంధమున్న కమల్‌ ఛింద్వారా నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచారు. 2019లో ఆ స్థానం నుంచి కమల్‌ కుమారుడు నకుల్‌ గెలిచారు. ఈ ఒక్కస్థానం తప్ప రాష్ట్రంలోని మిగతా 28 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు