తెలంగాణతో నాకు మంచి అనుబంధం ఉంది: చిదంబరం

16 Nov, 2023 13:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. ఇదే క్రమంలో తెలంగాణతో తనకు 2008 నుంచి మంచి అనుబంధం ఉందని తెలిపారు. దేశంలో‌నే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణే అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

కాగా, చిదంబరం తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన నాకు బాగా గుర్తు. తెలంగాణతో నాకు మంచి అనుబంధం ఉంది. రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కార్‌ అన్ని రంగాల్లో విఫలమైంది. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగింది. దేశంలో‌నే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణే. జాతీయ సగటు కన్న ఎక్కువ. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. పాల ధరలూ విపరీతంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి. వ్యాట్ ఎక్కువ వసూలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణే. గ్యాస్ ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి.

తెలంగాణ నిరుద్యోగ రేటు 7.8 (పురుషులు), 9.5 (మహిళలు)గా ఉంది. గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా అధికం. రాష్ట్రంలో 15.1 శాతంగా ఉంది. 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయలేదు. టీఎస్‌పీఎస్సీలో 22 లక్షల‌ మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారు. వారికి నిరుద్యోగ భృతి చెల్లించడంలో సర్కార్ ఫెయిల్ అయింది. ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంది. రాష్ట్ర అప్పులు‌ 3.66 లక్షల కోట్లకు పెరిగింది. ఏటేటా అప్పులు భారీగా  పెరిగాయి. ఫలితంగా ఒక్కొక్కరిపై 96 వేల రూపాయల అప్పు భారం పడింది. దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టంగా మారింది.

విద్య, వైద్యానికి కేటాయింపులు దారుణంగా పడిపోయాయి. పోషకాహార లోపం‌ తీవ్రంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో‌ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశాభివృద్ధికి కారణమయ్యాయి. కాంగ్రెస్‌కి అవకాశం ఇస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం’ అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. కొన్ని కీలక హామీలు ఇవే..

మరిన్ని వార్తలు