కాంగ్రెస్‌లోకి విజయశాంతి!.. ముహూర్తం ఎప్పుడంటే?

16 Nov, 2023 12:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పొలిటికల్‌ పార్టీల నుంచి అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల ప్రక్రియ, ఉప సంహరణ అన్నీ ముగిసిపోయినప్పటికీ జంపింగ్‌లు మాత్రం ఆగడం లేదు. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతూనే ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి కొందరు నేతలు క్యూ కట్టగా.. సీనియర్‌ నేత విజయశాంతి కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. 

వివరాల ప్రకారం.. బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె.. హస్తం పార్టీలో చేరుతున్నట్టు సమాచారం. ఇక, కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున ఖర్గే.. రేపు(శుక్రవారం) హైదరాబాద్‌కు రానున్నారు. కాంగ్రెస్‌ తలపెట్టిన కుత్బుల్లాపూర్‌ సభలో ఖర్గే పాల్గొంటారు. ఈ సభలోనే విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ చేరిక తర్వాత వచ్చే ఎన్నికల్లో మెదక్‌ నుంచి రాములమ్మ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా.. బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారు. పలు సందర్భాల్లో బీజేపీ హైకమాండ్‌ నిర్ణయాలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. పలు సమయాల్లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీపై అభిమానం కూడా చూపించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు