రేషన్‌కార్డుల విషయంలో గందరగోళం నెలకొంది: హరీష్‌ రావు

31 Dec, 2023 15:33 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌ రావు సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయటంలో జనానికి అనుమానాలు ఉన్నాయి. వంద రోజుల్లో అమలు ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే, రేషన్‌కార్డుల అమలు విషయంలో గందరగోళం నెలకొందని కామెంట్స్‌ చేశారు. 

తాజాగా హరీష్‌రావు మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. వంద రోజులు కచ్చితంగా ఓపిక పడతాం. కొంత మంది నేను జిల్లాలో తిరుగుతుంటే రైతు బంధు అని అడుగుతున్నారు. ఈ వంద రోజుల్లో దరఖాస్తులు తీసుకొని ఎంక్వైరీ చేసి నిదానంగా ఎన్నికల దాకా లాగుతారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయని చెప్పాలని కాంగ్రెస్‌ చూస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టాలని చూస్తోంది. ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఇవ్వకుండా దాట వేసే ప్రయత్నం జరుగుతోంది. 

ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. గైడ్ లైన్స్ లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చెప్పటం ఏంటో అర్థం కావటం లేదు. ఈ స్కీములు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పటం లేదు. రేషన్ కార్డు విషయంలో కూడా గందరగోళం నెలకొంది. అసలు ఇవి వస్తాయో రావో తెలియదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే వంద రోజుల్లో  ఆరు గ్యారంటీలు అమలు కావు. మొన్న విడుదల చేసింది శ్వేత పత్రాలు కావు, హామీల ఎగవేత పత్రాలు మాత్రమే. ఆన్ గోయింగ్ స్కీమ్ చేస్తేనే వంద రోజుల్లోగా ఈ హామీలు అమలు అవుతాయి. అలాంటి పరిస్తితి కనపడడం లేదు. 

ఉద్యమకారులకు 250 గజాల స్థలం గైడ్ లైన్స్ ఎక్కడ? ఎవరెవరికి ఇస్తారు. ఇప్పటికే ఇల్లు ఉన్న, ఉద్యోగం ఉన్నా ఇస్తారా? లేదా? స్పష్టత లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేయటంలో జనానికి అనుమానాలు ఉన్నాయి. వంద రోజుల్లో అమలు ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ల్యాండ్ కృజర్‌ల విషయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం సరికాదు. బీపీ వెహికిల్స్‌ విజయవాడలోనే తయారు చేస్తారు కాబట్టి ప్రభుత్వం అక్కడికి వెళ్ళింది. ఎవరు సీఎంగా ఉన్నా ఆ వాహనాలు వాడాల్సిందే. నిజంగా ఆరు గ్యారంటీ అమలు చేయాలనే చిత్తశుద్ది ఉంటే వెంటనే జీవో విడుదల చేసి ఇవ్వొచ్చు. 

ఆరోగ్యశ్రీ ఇప్పటి వరకు ఎంత మందికి 10 లక్షలు ఇచ్చారు?. కాంగ్రెస్ కోత, ఎగవేత, దాటవేతలు చేయాలని చూస్తోంది. నిరుద్యోగ భృతి విషయంలో భట్టి విక్రమార్క మేము హామీ ఇవ్వలేదు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ ఇస్తామని చెప్పారు. బడ్జెట్ సరిపోతుందా అనేది ముందే అనుకొని హామీలు ఇచ్చారు కదా?. ఎన్నికల కోడ్లో ఇరికించకుండా ధాన్యానికి బోనస్ ఇవ్వాలి. అసలు వస్తాయా రావా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. మీకు చిత్తశుద్ది ఉంటే వెంటనే అమలు చేయాలి. మిగితా పథకాలు వంద రోజుల్లో అమలు చేస్తారు సరే వరి ధాన్యం బోనస్ ఎలా ఇస్తారు. ఇది ఆలస్యం చేస్తే ఇబ్బంది కదా? 

ఆన్ గోయింగ్ స్కీమ్ చేస్తేనే వంద రోజుల్లోగా ఈ హామీలు అమలు అవుతాయి. అలాంటి పరిస్థితి కనపడటం లేదు. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరానికి 13 క్వింటాల్స్‌కు మాత్రమే 500 బోనస్ ఇస్తోంది.. మిగితా ధాన్యానికి ఇవ్వటం లేదు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఆలోచన చేస్తున్నట్లు ఉంది తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం. రైతు బంధు గతంలో రోజు వారీగా ఎంత ఇచ్చారు అనే లెక్కలను మేము చెప్పాం. కానీ, కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చాం అని చెప్తున్నారు కానీ.. ఎన్ని ఎకరాలకు ఎంత ఇచ్చారో కాంగ్రెస్ చెప్పటం లేదు. కరోనా సమయంలో అన్ని ఆపినా మేము రైతు బంధు ఆపలేదు. మేము ఈసీకి ఫిర్యాదు చేయం.. పథకాల అమలు కోరుకుంటున్నాం’ అని కామెంట్స్‌ చేశారు. 

>
మరిన్ని వార్తలు