2023: తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌.. రెండు సంచలనాలు ఇవే.. | Sakshi
Sakshi News home page

2023: తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామం.. రెండు పొలిటికల్‌ సంచలనాలు ఇవే..

Published Sun, Dec 31 2023 2:56 PM

KSR Comments Over Telugu States Heat Politics In 2023 - Sakshi

ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు. కొత్త సంవత్సరానికి స్వాగతం. ప్రతీ ఏటా కొత్త ఆశలతోనే కొత్త ఏడాది వస్తుంటుంది. దానికి ముందుగా జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి నెమరవేసుకుంటే బాగుంటుంది. 2023 సంవత్సరం ఓవరాల్‌గా చూస్తే బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కొంత ఆలస్యంగా అయినా వర్షాలు బాగానే పడ్డాయి. పంటలు ఫర్వాలేదు. గోదావరి నదికి యధా ప్రకారం వరదలు వచ్చాయి. కృష్ణానదికి మాత్రం ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడం నిరాశ కలిగించింది. 

✍️రాజకీయంగా పరిశీలిస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రెండు ప్రధానమైన ఘట్టాలు సంభవించాయి. ఒకటి తెలంగాణలో తొమ్మిదినర్నేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలవడం. మరొకటి ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో జైలు పాలవడం. ఈ రెండు అంశాలు సంచలనం కలిగించేవే. తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఆ పార్టీకి ఊపిరి పోసినట్లయింది. అదే టైమ్‌లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారం కోల్పోవడం వారికి పెద్ద ఆశాభంగమే. అంతేకాదు. బీజేపీ మధ్యప్రదేశ్‌లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇది బీజేపీకి బాగా లాభం అయింది. అంతకుముందు కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో గెలిచామన్న ఆనందంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు దానిని మిగల్చలేదు. కాకపోతే తెలంగాణ ఫలితం కాస్త ఉపశమనం ఇచ్చింది.

✍️తెలంగాణ ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాజకీయాలలో ఇది కీలక పరిణామం. కేసీఆర్ తాను ఓడిపోతానని ఊహించలేకపోయారు. ఎమ్మెల్యే అభ్యర్ధుల విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోవడం ఆయన కొంప ముంచింది. కాంగ్రెస్‌పై సానుకూలత కన్నా కేసీఆర్, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన  కారణంగా కనిపిస్తుంది. ఒక ఇరవై నుంచి ముప్పై మంది సిటింగ్‌లను మార్చి ఉంటే రాజకీయం ఇంకో రకంగా ఉండేది. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడం బీఆర్ఎస్‌కు అపశకునంగా మారింది. అది వారి మెడకు చుట్టుకుంది. దానిపై కేసీఆర్ సమాధానం ఇవ్వలేకపోయారంటేనే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. 

✍️అలాగే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులతో ఆడుకున్న వైనం కూడా కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేసింది. అయితే, హైదరాబాద్‌లో ఆ పార్టీ ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్ది పనులు కలిసి వచ్చి బీఆర్‌ఎస్‌కు పూర్తి స్థాయి ఫలితాలు రావడంతో పార్టీ నిలబడగలిగింది. కాంగ్రెస్ ఈ ప్రాంతంలో కూడా మెజార్టీ సాధించి ఉంటే అది  ఆ పార్టీకి వేవ్‌గా మారేది. అప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారేది. కొత్త శాసనసభకు కేసీఆర్ ఇంతవరకు హాజరుకాలేకపోయారు. ఆయన తన ఫాం హౌస్‌లో జారిపడటంతో తుంటి విరిగింది. దాంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తామే ఉన్నామన్న వాతావరణాన్ని బీజేపీ పెద్దలు స్వయంకృతాపరాధంతో చెడగొట్టుకున్నారు. అయినా, ఎనిమిది సీట్లు గెలవడం విశేషమే.

✍️బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య రహస్య అవగాహన ఉందన్న ప్రచారం ఆ పార్టీకి చేటు తెచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేస్తున్నామన్నంతగా బీజేపీ నేతలు హడావుడి చేశారు. అలా జరగకపోవడంతో ప్రజలలో అనుమానాలు  ఏర్పడ్డాయి. రెండేళ్ల క్రితం వరకు కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న తరుణంలో బీజేపీ వ్యూహాత్మక తప్పిదాలు కాంగ్రెస్‌కు ఉపయోగపడ్డాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలను వీలైనంతవరకు కలుపుకుని వెళ్లడంలో రేవంత్ రెడ్డి సఫలం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు  గ్యారంటీలు, వివిధ డిక్లరేషన్‌లు కొంత ఉపయోగపడి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు అవే కాంగ్రెస్‌కు పెను సవాళ్లుగా మారుతున్నాయి. 

✍️వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌కు పెద్ద పరీక్షే అవుతాయి. వంద రోజుల్లో ఆ గ్యారంటీల అమలు కొంతమేర అయినా జరిగితే  ప్రజలు సంతృప్తి చెందుతారు. కానీ, నిధుల సమస్య కారణంగా ప్రస్తుతం కాలయాపన చేయడంలో భాగంగానే దరఖాస్తుల స్వీకరణ, తదితర ప్రక్రియ చేపట్టినట్లుగా ఉంది. 2024 సంవత్సరంలో  బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలపై జ్యుడీషియల్ విచారణ ఎలా సాగుతుంది? దాని ప్రభావం ప్రజలపై ఏ మేరకు ఉంటుందన్నదానిపై బీఆర్ఎస్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉండవచ్చు. కానీ, కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా వీటితోటే కథ నడిపితే కాంగ్రెస్‌కు కూడా నష్టం జరిగి ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ పుంజుకునే అవకాశం కూడా లేకపోలేదు. 2023 మాత్రం కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు తీరని చేదు ఫలితాన్ని మిగిల్చితే, కాంగ్రెస్‌కు అనుకోని వరాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.  పార్లమెంటు ఎన్నికలలో మంచి ఫలితాలు పొందలేకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తుకు కూడా గండం ఏర్పడవచ్చు. కేటీఆర్‌, హరీష్ రావులు ప్రత్యామ్నాయ నేతలుగా ప్రజల విశ్వాసం పొందితే  పార్టీ నిలబడుతుంది.

✍️ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యథాప్రకారం ప్రజలలో తన ఆధిక్యతను కొనసాగిస్తున్నారని పలు సర్వేలు వెల్లడించాయి. తనను ఎవరూ  ఏమి చేయలేరని, తానెవ్వరికి లీగల్‌గా, సాంకేతికంగా దొరకనని డాంబికాలు చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసి సంచలనం సృష్టించింది. తనను ఎవరూ పీకలేరని, టీడీపీ వారు ఎవరు గొడవలు చేసినా, వారిపై ఎన్ని కేసులు వచ్చినా, కోర్టులలో తాము చూసుకుంటానని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు చెబుతూ వచ్చేవారు. తద్వారా టీడీపీ క్యాడర్‌ను రెచ్చగొట్టేవారు. దాంతో అమాయకులైన పలువురు టీడీపీ కార్యకర్తలు అల్లర్లు  చేసి జైలుపాలయ్యారు. చివరికి చంద్రబాబే అవినీతి కేసులో చిక్కుకోవడంతో చట్టం ఎవరికి చుట్టం కాదన్న సంగతి టీడీపీ నేతలకు, కార్యకర్తలకు అర్థం అయ్యింది. 

✍️ఎల్లకాలం వ్యవస్థలను మేనేజ్ చేయడం కుదరదని కూడా తేలింది. స్కిల్ స్కామ్‌లో వచ్చిన అభియోగాలకు సమాధానం చెప్పకుండా, గవర్నర్ అనుమతి లేకుండా కేసు పెట్టడం అన్యాయమని చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తుండడంతో కేసులో బలమైన ఆధారాలు ఉన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. చంద్రబాబు అరెస్టును సానుభూతిగా మార్చుకోవాలని టీడీపీ విఫలయత్నం చేసింది. చివరికి చంద్రబాబు తన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను కూడా రంగంలో దించడం విశేషం. చంద్రబాబు అరెస్టుతో తల్లడిల్లి సుమారు 153 మంది మరణించారంటూ కొత్త డ్రామాకు తెరదీశారు. భువనేశ్వరి ముగ్గురి ఇళ్లకు వెళ్లి మూడేసి లక్షల చొప్పున డబ్బు ఇచ్చి వచ్చారు. ఇంతలో చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆమె డబ్బు దండగ అనుకున్నారో ఏమో కానీ, ఓదార్పుయాత్రను విరమించుకుని ఇంటికి వెళ్లిపోయారు. 

✍️చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే ఆయన కుమారుడు లోకేష్ కన్నా, దత్తపుత్రుడని వైఎస్సార్‌సీపీ తరచు విమర్శించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువ హడావుడి చేసి, రోడ్డుపై దొర్లి ఆ విమర్శను సార్దకం చేసుకున్నారు. తదుపరి రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి టీడీపీతో పొత్తు ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఒకపక్క బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో అక్రమ రాజకీయ సంబంధాన్ని పెట్టుకుని దానిని అదీకృతం చేశారు. అదే సమయంలో బీజేపీ మాత్రం తమతో జనసేన పొత్తు కొనసాగుతుందని చెప్పడం చిత్రమే. యువగళం ముగింపు సభలో టీడీపీ, జనసేన అక్రమ రాజకీయ సంబంధాన్ని బీజేపీ పెద్దలు ఆశీర్వదించాలని పవన్ కల్యాణ్ కోరడం  కొసమెరుపు. అంతకు ముందు తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీచేసి డిపాజిట్లు పోగొట్టుకున్న పవన్ ఏపీబాబు, లోకేష్‌లకు పూర్తిగా సరెండర్ అయ్యారన్న విమర్శలకు గురవుతున్నారు.

✍️చంద్రబాబే సీఎం అభ్యర్ధి అని లోకేష్ స్పష్టంగా చెప్పినా, పవన్ మౌనంగా ఉండటం ఆ పార్టీ కేడర్‌కు అవమానంగా మారింది. పొత్తులో  కనీసం అరవై సీట్లు అయినా తీసుకోవాలని జనసేన క్యాడర్‌ కోరుతుంటే వారిని ఆయన వైఎస్సార్‌సీపీ  కోవర్టులగా ప్రకటించారు. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం మరో చిత్రమైన పరిణామం. ఒకవైపు  బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ, మరోవైపు బెంగుళూరులో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చంద్రబాబు మంతనాలు జరపడం ఆయన రెండుకళ్ల సిద్దాంతానికి మరో నిదర్శనంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ తప్పదని భయపడుతున్న చంద్రబాబు అక్కడ టూర్లు పెంచి, తాను మళ్లీ గెలిస్తే కుప్పాన్ని అభివృద్ది చేస్తానని చెబుతుండడంపై  అంతా విస్తుపోతున్నారు. 

✍️నారా లోకేష్ యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ఆరంభించిన రోజునే తన మేనమామ కొడుకు తారకరత్న మరణించారు. ఆ తర్వాత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు  కాగా యువగళానికి బ్రేక్ వేసి డిల్లీకి వెళ్లి ఎక్కువకాలం అక్కడే గడిపారు. తండ్రికి బెయిల్ వచ్చాక కొన్నాళ్లకు మళ్లీ మొదలుపెట్టి విశాఖ వద్ద ముగించారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వాన్ని, వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడం అంత తేలిక కాదని కంగారు పడుతున్న చంద్రబాబు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో పాటు, ఇద్దరు వ్యూహకర్తలను నియమించుకున్నారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు నిత్యం అబద్దాలు వండి వార్చుతున్నా జనం నమ్మడం లేదన్న భావనతో ఒకప్పుడు తాను డెకాయిట్ అని తిట్టిన మరో వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ను ప్రత్యేక విమానంలో రప్పించుకుని సంప్రదింపులు చేశారు.

✍️మరోవైపు ముఖ్యమంత్రి జగన్ అటు ప్రభుత్వ కార్యక్రమాలను, ఇటు పార్టీ వ్యవహారాలను ఒంటిచేత్తో చక్కబెడుతూ ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, ఆయన రాజీపడటం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ఉదంతాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద కిడ్నీ బాధితులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పరిశోధన కేంద్రం, మూడు నియోజకవర్గాల గ్రామాలకు ఉపయోగపడే భారీ సురక్షిత నీటి పథకాన్ని అమలు చేసి తన సమర్ధతను రుజువు చేసుకున్నారు. విద్య, ఆరోగ్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇస్తూ బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్నారు. ఏపీ నుంచి విద్యార్థి బృందం ఐక్యరాజ్యసమితికి వెళ్లడం, ఆంగ్లంలో ఏపీ పిల్లలు గణనీయ విజయాలు సాధించడం మొదలైవని సీఎం జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 

✍️రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వేగంగా సాగిస్తున్నారు. ప్రభుత్వరంగంలో పదిహేడు మెడికల్ కాలేజీలను చేపట్టారు. బద్వేల్ వద్ద ప్లైవుడ్ కర్మాగారానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. అలాగే పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లకు శ్రీకారం చుడుతున్నారు. విశాఖలో  ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్ వంటి సంస్థలు ఈ ఏడాది ఏర్పాటు కావడం శుభపరిణామం. విశాఖలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుండగా, టీడీపీ, జనసేన, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇతర ఎల్లో మీడియా శక్తులు తీవ్రంగా అడ్డుపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

✍️విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చడానికి సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు కోర్టుల ద్వారా వీరు ఆటంకాలు కల్పిస్తున్నారు. రాజకీయంగా వచ్చే ఎన్నికలకు మిగిలిన పార్టీలకన్నా ముందుగానే సన్నద్దం అవుతున్నారు. అవసరమైతే సిటింగ్‌లను మార్చుతానని కొన్ని నెలల క్రితమే ప్రకటించి, మార్పులు, చేర్పులతో ప్రత్యర్దులకు సవాల్ విసురుతున్నారు. ఈ సందర్భంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నా, ఆయన వాటిని ఎదుర్కోవడానికే సిద్దపడుతున్నారు. జనాభిప్రాయానికి అనుగుణంగానే ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో సాగుతున్నారు. అందువల్లే తాజా సర్వేలలో కూడా సీఎం జగన్‌కు ఏభైఎనిమిది శాతం మంది జై కొడుతున్నారని తేలింది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో మళ్లీ వైఎస్సార్‌సీపీదే అధికారం అని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక, అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
Advertisement