రాష్ట్ర రక్షణకు మేధావులు బీజేపీలోకి రావాలి..

31 Aug, 2023 01:37 IST|Sakshi

కల్వకుంట్ల కుటుంబం రాష్ట్ర ప్రజల రక్తం తాగుతోంది

భూములు, మద్యం అమ్మనిదే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థితి లేదు

ఈ పరిస్థితుల్లో విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి

కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపు

చెన్నమనేని వికాస్‌రావు, ఆయన భార్య దీప బీజేపీలో చేరిక

ప్రజలకు సేవ చేసేందుకే కమలంలోకి: వికాస్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒక చేత్తో ఆసరా పెన్షన్‌ ఇచ్చి, మరో చేతిలో మద్యం బాటిల్‌ పెట్టి కేసీఆర్‌ సర్కారు డబ్బులు లాగేసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో భూములు, మద్యం అమ్మనిదే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. విద్యుత్‌ చార్జీలు, ఆరీ్టసీ, భూముల రిజిస్ట్రేషన్, ఇంటిపన్ను ఇలా.. అన్ని రకాల చార్జీలను పెంచి ప్రజలపై ప్రభు త్వం తీరని భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

బుధవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్‌ సమక్షంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు కుమారుడు డా.చెన్నమనేని వికాస్‌రావు, ఆయన భార్య డా. దీప బీజేపీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం కూడా.. భూముల వేలం ద్వారా డబ్బు సమకూర్చుకుంటోన్న దుస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక అవసరాల కోసం ఓఆర్‌ఆర్‌ రింగ్‌ రోడ్డును తాకట్టు పెట్టడం దారుణమన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం తెలంగాణలోని విద్యావంతులు, మేధావులు బీజేపీలోకి రావాలని ఆహా్వనిస్తున్నామని ఆయన పిలుపునిచ్చారు. 

ఏ బాధ్యతనిచ్చినా స్వీకరిస్తాం: డాక్టర్‌ వికాస్‌ 
బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్‌జోషి వంటి పెద్దల ప్రభావం తనపై ఉందని పారీ్టలో చేరిన డాక్టర్‌ వికాస్‌ తెలిపారు. తాను, తన భార్య డా.దీప ప్రజలకు మరింత సేవ చేసేందుకు బీజేపీలో చేరామని, రాబోయే రోజుల్లో అప్పగించే బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని చెప్పారు. 

ఎన్నికలెప్పుడొచ్చినా బీజేపీ గెలుపు తథ్యం : బండి సంజయ్‌ 
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారనీ, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనమన్నారు. కిషన్‌ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రామరాజ్యం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. డా.వికాస్, దీపల చేరికతో రాజన్న సిరిసిల్లలోని రెండు నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. 

విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి: డా. కె. లక్ష్మణ్‌  
దేశంలో మోదీ ప్రభుత్వ సుపరిపాలనకు ఆకర్షితులై, ప్రజలకు మరింత సేవా చేయాలనే సంకల్పంతో డాక్టర్‌ వికాస్, దీప దంపతులు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రంలోని విద్యావంతులు ముఖ్యంగా యువత రాజకీయ రంగంలోకి రావాలని విలువలతో కూడిన రాజకీయాలు, జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు వారితోనే సాధ్యమన్నారు. 

ఉత్తర తెలంగాణలో బీజేపీ బలోపేతం: ఎంపీ అర్వింద్‌ 
వేములవాడ ప్రాంతంలో సామాజిక, సేవా కార్యక్రమాలను చేపడుతున్న డాక్టర్‌ దీప, వికాస్‌ దంపతుల చేరికతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీ మరింత బలోపేతమవుతుందని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి చెప్పారు.  

మరిన్ని వార్తలు