ఈటల కన్నా పెద్ద మనిషి కాసాని 

4 Nov, 2023 04:33 IST|Sakshi
కాసాని జ్ఞానేశ్వర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

కాసాని రాకతో ముదిరాజ్‌లకు పదవులు వస్తాయి 

ముదిరాజ్‌ వర్గానికి పెద్దపీట వేస్తాం 

సీఎం సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన టీటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని  

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయంగా ముదిరాజ్‌ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్‌లకు వస్తాయని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శుక్రవారం గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ తన అనుయాయులతో కలసి బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్‌ వంటి నాయకుడు బీఆర్‌ఎస్‌లో చేరడం శుభపరిణామమని అన్నారు. జ్ఞానేశ్వర్‌ ఏడాది కిందటే బీఆర్‌ఎస్‌లోకి రావాల్సిందని, ఆలస్యమైనా రాజకీయంగా ఎంతో అనుభవజు్ఞలైన ఆయన రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈటల రాజేందర్‌ కన్నా పెద్ద మనిషి జ్ఞానేశ్వర్‌ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల తరువాత ముదిరాజ్‌లతో సమావేశం అవుతానని, ఎవరెవరికి ఎక్కడ అవకాశం ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పారు.

ముదిరాజ్‌ల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు కావాలని, ఈసారి రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులతో పాటు ఇతర నామినేటెడ్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్, మున్సిపల్‌ చైర్మన్, స్థానిక సంస్థల పదవుల్లో పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు. పారీ్టలో ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదని, ఈటలను మించిన నాయకులు ముదిరాజుల్లో ఉన్నారని అన్నారు. ముదిరాజ్‌ వర్గానికి చెందిన బండ ప్రకాశ్‌ని తీసుకొచ్చి ఎంపీ, ఎమ్మెల్సీ, కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు.

ఎన్నికల తరువాత జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో ముదిరాజ్‌ కులపెద్దలను కూర్చోబెట్టుకొని వారి ప్రధాన సమస్యల పరిష్కారంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా జ్ఞానేశ్వర్‌తోపాటు బీఆర్‌ఎస్‌లో చేరినవారిలో కాసాని వీరేశ్, బండారి వెంకటేశ్‌ ముదిరాజ్, ముప్పిడి గోపాల్, బియ్యని సురేశ్, ప్రకాశ్‌ ముదిరాజ్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు