ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉండొద్దు | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉండొద్దు

Published Sat, Nov 4 2023 4:34 AM

-

పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్‌ అనిల్‌కుమార్‌

మెదక్‌ కలెక్టరేట్‌: వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్‌ అనిల్‌కుమార్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్‌కు వచ్చిన ఆయన సమీకృత కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, పౌర సరఫరాల కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ హరికృష్ణ, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రపాల్‌, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు, లారీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం లారీలు ఒక రోజు కంటే ఎక్కువ ఆగకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు. ధాన్యం వెనువెంటనే తరలించాలన్నారు. అనంతరం చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వారికి తగు సూచనలు చేశారు.

టెన్త్‌ వార్షిక పరీక్షలఫీజు 17లోగా చెల్లించాలి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల17 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 1 వరకు, రూ.200తో 11వరకు, రూ.500 డిసెంబర్‌ 20వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125, మూడు సబ్జెక్టులు, అంత కంటే తక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైనవారు రూ.125, వొకేషనల్‌ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Advertisement
Advertisement