G20 Summit: నేతలకు పేదరికం కనిపించకుండా దాస్తోంది

10 Sep, 2023 04:41 IST|Sakshi

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: జీ20 భేటీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టిన చర్యలపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మురికి వాడలను కనిపించకుండా చేయడం, ధ్వంసం చేయడం వంటి వాటితోపాటు వీధుల్లో తిరిగే కుక్కలు తదితర జంతువులను క్రూరంగా బంధించడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు. అతిథుల ఎదుట మన దేశ వాస్తవాలను దాచాల్సిన అవసరం లేదన్నారు.

విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్‌ శనివారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న మురికివాడల చుట్టూ పచ్చని పాలిథిన్‌ షీట్లను కప్పి ఉంచినట్లుగా ఉన్న వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. ‘ప్రభుత్వం మమ్మల్ని పురుగులుగా భావిస్తోంది. మేం మనుషులం కామా?’ అని స్లమ్‌ నివాసి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. ఈ విషయమై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌.. మోదీ చర్యలను విమర్శించారు. ‘మోదీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జీ20 శిఖరాగ్రం వేళ మురికివాడలను కనిపించనీయడం లేదు. ఎందుకంటే రాజు పేదలను ద్వేషిస్తాడు’అని కాంగ్రెస్‌ ప్రధాని మోదీనుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు