గులాబీలో గ్రూపు తగాదాలు, కమలంపై నజర్‌..

2 Mar, 2021 09:17 IST|Sakshi

‘గులాబీ’లో గ్రూపు తగాదాలు 

వలస నేతల పెత్తనంపై కినుక  

పార్టీ కార్యక్రమాలకు సీనియర్లు దూరం 

బీజేపీ వైపు కీలక నాయకుల చూపు 

వేచిచూసే ధోరణిలో మరికొంత మంది 

సాక్షి, వికారాబాద్‌: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, వేగంగా మారుతున్న సమీకరణాల ప్రభావం జిల్లాపై పడుతోంది. దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో.. టీఆర్‌ఎస్‌ అసంతృప్తి నేతల్లో అంతర్మథనం మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడినవారు, గులాబీ జెండాలు మోసి జైలు పాలైన వారికి ప్రాధాన్యం తగ్గిందనేది టీఆర్‌ఎస్‌ సీనియర్ల వాదన. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొంతమంది వలస నేతలు.. తమ కళ్ల ముందే అందలం ఎక్కుతుండటాన్ని.. వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇతర పార్టీల్లో నిరాదరణకు గురైన కొంతమంది నాయకులు తప్పని పరిస్థితిలో గులాబీ కండువా వేసుకున్నారు.

అయితే ఏళ్లు గడుస్తున్నా.. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండటంతో ప్రస్తుతం చాలా మంది కాషాయ దళం వైపు చూస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో వలసవాదులకు ప్రాధాన్యం ఎక్కువైందనే కారణంతో చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతేడాది జరిగిన వికారాబాద్‌ పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి వలస నాయకులకే అత్యధికంగా టిక్కెట్లు దక్కాయి. 34 కౌన్సిలర్‌  స్థానాలకు గానూ 24 చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే బీఫాంలు ఇచ్చారు. గత శాసన సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌కు మద్దతు పలికిన వారిలో అత్యధికులు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కొనసాగతూ పదవులు దక్కించుకున్నారు. అయితే చంద్రశేఖర్‌ బీజేపీలో చేరడంతో వీరంతా తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

అంతర్గత విభేదాలు.. 
వికారాబాద్‌ నియోజవర్గంలోని మర్పల్లి, ధారూరు, వికారాబాద్, కోట్‌పల్లి, బంట్వారం, మోమిన్‌పేట మండలాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కొందరిని పలకరించే వారే కరువయ్యారు. ఇబ్బడి ముబ్బడిగా నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో అందరికి సముచిత ప్రాధాన్యం కల్పించడం తల నొప్పి వ్యవహారంలా మారింది. దీంతో ప్రాధాన్యానికి నోచుకోని వలస నాయకులు బీజేపీ గూటికి చేరాలని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో ప్రజా ప్రతినిధులుగా కీలక పదవుల్లో కొనసాగుతున్న వారు వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌కు షాకిచ్చి బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.   

తాండూరులో వర్గపోరు.. 
తాండూరు నియోజవర్గంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. రానున్న శాసన సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున తాండూరు నుంచి ఎవరు టికెట్‌ దక్కించుకున్నా.. మరో నేత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య సయోధ్య కుదర్చడానికి మంత్రి కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం లేకుండాపోయింది. వీరిద్దరి మధ్య పొసగని పరిస్థితి నెలకొనడంతో పార్టీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. ఎన్నికలు దగ్గర పడేకొద్ది ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాండూరులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య సయోధ్య కుదరడం సాధ్యం కాని అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల్లో తాండూరు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా రోహిత్‌రెడ్డి పోటీ చేయగా.. రోహిత్‌రెడ్డి అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌ నుంచి గెలిచిన రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయ న ప్రతిష్ట మసకబారిందని, ఇదే సమయంలో మహేందర్‌రెడ్డి ఓటమితో తాండూరు అభివృద్ధి కుంటుపడిందనే వాదన వినిపిస్తోంది. 

శ్రేణుల్లో అయోమయం...
మొదటినుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగతూ తెలంగాణ ఉద్యమంలో జిల్లా తరఫున కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు శుభప్రద్‌పటేల్‌కు ఇప్పటి వరకు కూడా ఏ పదవీ దక్కలేదు. ప్రత్యేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనపై 63 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు జైలుకు సైతం వెళ్లారు. అయితే టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత కూడా శుభ్రపద్‌కు ప్రాధాన్యం దక్కలేదు. దీంతో ఆయన గులాబీ పార్టీలో కొనసాగడం దండగ అనే అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది. ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్న బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారని సమాచారం. అయితే శుభప్రద్‌ మాత్రం మరికొంత సమయం వేచి చూడాలనే ధోరణిలో ఉన్నారని వినికిడి. వికారాబాద్‌ నియోజవకర్గంలో టీఆర్‌ఎస్‌ పైకి బలంగా కనిపిస్తున్నా.. పార్టీలోని సీనియర్లు, వలస నాయకుల మధ్య ఏర్పడిన దూరం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. బీజేపీలో ఉత్సాహం పెరుగుతుండటంతో అటు వైపు వెళ్లేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నాయకులు మంతనాలు జరుపుతున్నారు.

పరిగివైపు ‘కాసాని’ చూపు.. 
పరిగి నియోజకవర్గంలో సైతం టీఆర్‌ఎస్‌ బలంగా కనిపిస్తున్నప్పటికీ బీజీపీ ప్రభావాన్ని కొట్టి పారేయలేమని విశ్లేషకుల అంచనా. కేంద్రంలోని మోదీ సర్కార్‌ అనుసరిస్తున్న దేశ రక్షణ చర్యలు, 370 ఆర్టికల్‌ రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, త్రిపుల్‌ తలాక్‌  రద్దు వంటి చర్యలతో బీజేపీ యువత దృష్టిని ఆకర్శించింది. పరిగి నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వర్‌రెడ్డికి పోటీగా.. బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ను రంగంలోకి దించాలని కమలనాథులు ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వ్యూహం ఫలించి కాసాని బరిలోకి దిగితే టీఆర్‌ఎస్‌కు కష్టం తప్పదని సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే గ్రామ స్థాయి నుంచి టీఆర్‌ఎస్‌కు  చెందిన ప్రజా ప్రతినిధులే ఎక్కువగా ఉన్నప్పటికీ, వారు సొంత పనులు మినహా పార్టీ కార్యక్రమాల వైపు దృష్టి సారించకపోవడంతో రాబోయే కాలంలో జిల్లా సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

‘పట్నం’ సోదరులది ఒకే దారి..  
కొడంగల్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పట్నం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిపై విజయం సాధించారు. ఈ గెలుపుతో నరేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్శించారు. నరేందర్‌రెడ్డి.. తాండూరు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి స్వయానా తమ్ముడు కావడంతో భవిష్యత్తులో మహేందర్‌రెడ్డి 
ఏ నిర్ణయం తీసుకున్నా నరేందర్‌రెడ్డి కూడా ఆయన బాటలోనే నడిచే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు