ఆయన పొలిటికల్‌ టూరిస్టు

14 Apr, 2022 04:22 IST|Sakshi
ఆప్కో షోరూమ్‌ ప్రారంభిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

పవన్‌కల్యాణ్‌పై పరిశ్రమలు,ఐటీశాఖ మంత్రి అమర్‌నాథ్‌ ధ్వజం

సాక్షి, అమరావతి/గన్నవరం: పవన్‌కల్యాణ్‌ రాష్ట్రానికి పొలిటికల్‌ టూరిస్టు అని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు పవన్‌కల్యాణ్‌ అనే వ్యక్తి ఉన్నట్టు సరిగా గుర్తుండదన్నారు. ‘పవన్‌ కల్యాణ్‌ రోజుకో డైలాగ్‌ చెబుతారు. ఈ రోజు చెప్పింది రేపు, రేపు చెప్పింది ఎల్లుండి మర్చిపోతారు. నిన్న అనంతపురంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు..’ అని పేర్కొన్నారు. ఎవరికోసమో దత్తపుత్రుడిగా పనిచేస్తున్న వ్యక్తికి తమ నాయకుడిపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. ఎటువంటి సిద్ధాంతాలు, ఆలోచనలు లేని ఓ రాజకీయ పార్టీ నాయకుడి గురించి మాట్లాడటం సమయం వృథా చేసుకోవడమేనని చెప్పారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల ప్రత్యేకతల ఆధారంగా పరిశ్రమలను నెలకొల్పుతామన్నారు. విశాఖ నగరాన్ని ప్రపంచస్థాయి ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.

చేనేత సంఘాలు, కార్మికులకు బకాయిల విడుదల
చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర పరిశ్రమల, చేనేత, జౌళిశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. కృష్ణాజిల్లా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్‌ టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన ఆప్కో షోరూమ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత సంఘాలకు, కార్మికులకు ఉన్న అన్నిరకాల బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.

వారి అవసరాల కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చేందుకు కూడా వెనుకాడవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలిచ్చారని తెలిపారు. ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి మోహన్‌రావు మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు షోరూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డులో మెగా షోరూమ్‌ను సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆప్కో ఎండీ చదలవాడ నాగమణి, చేనేత, జౌళిశాఖ సంయుక్త సంచాలకుడు కన్నబాబు, ఆప్కో మార్కెటింగ్‌ మేనేజర్‌ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు