రె‘బెల్స్‌’ కాదు ... ప్రత్యర్థి పక్షమే! 

24 Nov, 2023 04:43 IST|Sakshi

ఎన్నికల్లో భారీగా తగ్గిన అసంతృప్తుల బెడద 

టికెట్లు రానివారు వేరే పార్టీల్లో చేరిక  

అప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న వారికే మద్దతు  

పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, ప్రేంసింగ్‌రాథోడ్, చందర్‌రావుకు టికెట్లు రాక పార్టీ నుంచి జంప్‌ 

రెబెల్‌గా పోటీ చేసే కంటే ప్రత్యర్థి పార్టీలో చేరి అప్పటి వరకు కొనసాగిన పార్టీ అభ్యర్థిని ఓడించడమే ఎత్తుగడ 

ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం ఒకెత్తయితే... సొంత పార్టీ నుంచి రెబెల్‌గా ఎవరూ లేకుండా చూసుకోవడం మరోఎత్తు.  తాము ఎప్పటి నుంచో ఉంటున్న పార్టీ ఎన్నికల సమయంలో టికెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గానో, మరో పార్టీ నుంచో పోటీ చేసి గెలిచిన నాయకులు  తెలంగాణలో చాలా మందే ఉన్నారు. ఒకవేళ గెలవకపోయినా, సొంత పార్టీ అభ్యర్థిని ఓడించి ప్రత్యర్థి పార్టీ గెలుపునకు పరోక్షంగా కారకులైన వారూ ఉన్నారు. కొన్నిసార్లు పేరున్న రెబెల్‌ కారణంగా పోటీలో ఉన్న ప్రధాన పార్టీల్లోని ఏ అభ్యర్థి ఓడిపోతాడో చెప్పలేని పరిస్థితి. కానీ ఈసారి సీన్‌ మారింది.

రెబెల్స్‌ పోటీలో నిలిచిన నియోజకవర్గాలు చాలా తక్కువగా ఉన్నాయి. రెబెల్స్‌గా పోటీ చేసే బదులు ప్రత్యర్థి పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా పనిచేయడం అనే పద్ధతిని ఈసారి చాలామంది ఫాలో అయిుపోయారు. పీసీసీ అధ్యక్షుడిగా , రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య మొదలు మాజీ మంత్రులు నాగం జనార్దన్‌ రెడ్డి(నాగర్‌కర్నూలు),  సంభాని చంద్రశేఖర్‌ (సత్తుపల్లి), మాజీ ఎమ్మెల్యేలు పి. విష్ణువర్దన్‌రెడ్డి (జూబ్లీహిల్స్‌),  ప్రేంసింగ్‌ రాథోడ్‌(గోషామహల్‌), చందర్‌రావు(కోదాడ), బిరుదు రాజమల్లు (పెద్దపల్లి) వంటి వారు ఇందులో ఉండడం గమనార్హం.  

కాంగ్రెస్‌ టికెట్‌ రాక బీఆర్‌ఎస్‌లోకి 
కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకులు రెబెల్స్‌గా బరిలో దిగాలని తొలుత భావించినప్పటికీ, ‘సింబల్‌’ లేకుండా గెలవడం కష్టమనే భావనతో మధ్యే మార్గంగా ప్రత్యామ్నాయ పార్టీలను చూసుకున్నారు. బీఆర్‌ఎస్‌ కూడా టికెట్‌ రాని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కండువాలు కప్పి మరీ సాదరంగా ఆహా్వనించింది. కొట్లాడుతామనుకున్న వాళ్లకే మద్దతుగా ప్రచారం చేయాల్సిన అనివార్య పరిస్థితి కల్పించింది.

ఇలాంటి వారిలో చెరుకు సుధాకర్‌ (నల్లగొండ), తాటి వెంకటేశ్వర్లు (అశ్వరావుపేట), పాల్వాయి స్రవంతి (మునుగోడు), గండ్రత్‌ సుజాత (ఆదిలాబాద్‌) వంటి వారున్నారు. బీజేపీ నుంచి కూడా రాకే‹Ùరెడ్డి (వరంగల్‌), తుల ఉమ (వేములవాడ), రమాదేవి (ముధోల్‌) టికెట్‌ రాక భంగపడి బీఆర్‌ఎస్‌లో చేరారే తప్ప రెబెల్స్‌గా పోటీ చేసే సాహసం చేయలేదు. 

ఒక పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే మరో పార్టీ నుంచి బరిలో... 
ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించింది. కొందరు మినహా సిట్టింగ్‌లకే ఆ పార్టీ టికెట్లు కేటాయించడంతో ఆయా నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన వారు రెండు నెలలు ఆలోచించిన అనంతరం ఎక్కువ శాతం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఖమ్మంకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌ నుంచి పోటీ పడుతున్నారు.  

జలగం వెంకట్రావు ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీలో ఉన్నారు. తన కొడుకుకు మెదక్‌ సీటివ్వలేదని అలిగిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అలాగే టికెట్‌ దక్కని రేఖా నాయక్‌(ఖానాపూర్‌) కాంగ్రెస్‌లో చేరగా, ఆమె భర్త శ్యాంనాయక్‌కు ఆసిఫాబాద్‌ టికెట్‌ లభించింది. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు మద్దతుగా ఆపార్టీలో చేరారు. నిర్మల్‌ నుంచి శ్రీహరిరావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. సంగారెడ్డి టికెట్‌ ఆశించిన పులిమామిడి రాజు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన పురమళ్ల శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ టికెట్‌ దక్కించుకున్నారు. అంబర్‌పేటలో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్, మునుగోడు నుంచి చెలిమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు.  చేవెళ్లలో రత్నం, మానకొండూరు నుంచి ఆరెపల్లి మోహన్, రామగుండం నుంచి కందుల సంధ్యారాణి బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. కల్వకుర్తిలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌ టికెట్టుపై పోటీ చేస్తున్నారు.  

ఇండిపెండెంట్లుగా గెలిచిన వారెందరో...! 
తెలుగుదేశం ఆవిర్భావం అనంతరం 1983లో వచ్చిన ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఉమ్మడి రాష్ట్రంలో 19 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించగా, అందులో తెలంగాణ నుంచే తొమ్మిది మంది విజయం సాధించారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో గెలిచిన 9 మందిలో 8 మంది తెలంగాణ నుంచి కావడం గమనార్హం. వీరిలో అధిక సంఖ్యలో తెలుగుదేశం టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులే ఉన్నారు. 1989 ఎన్నికల్లో ఏకంగా 15 మంది స్వతంత్రులు విజయం సాధించగా, అందులో 8 మంది తెలంగాణ నుంచే.

ఆలేరులో మోత్కుపల్లి నర్సింహులు, కరీంనగర్‌లో  బి.జగపతి రావు వంటి నేతలు అప్పుడు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కక రెబల్‌గా పోటీ చేసి గెలిచిన వారే. 1994లో మరోసారి ఎన్టీఆర్‌ ప్రభంజనంలో 12 మంది ఇండిపెండెంట్లు గెలవగా, అందులో తెలంగాణ నుంచి గెలిచిన ఐదుగురు ఇండిపెండెంట్లలో తుంగతుర్తి నుంచి ఆర్‌.దామోదర్‌ రెడ్డి , గద్వాల నుంచి డీకే.భరత్‌ సింహారెడ్డి, కల్వకుర్తి నుంచి ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్‌ రెబల్స్‌గా విజయం సాధించారు. 2004లో 11 మంది ఇండిపెండెంట్లు గెలవగా తెలంగాణ నుంచి విజయం సాధించిన నలుగురిలో కొల్లాపూర్‌ నుంచి జూపల్లి కృష్ణారావు వంటి వారు ఉన్నారు. 

2004 నుంచి ఇతర పార్టీల గుర్తుల మీద... 
2004 ఎన్నికల నాటి నుంచి టికెట్లు రాని వారు రెబెల్స్‌గా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ గుర్తుల మీద పోటీ చేసే ఆచారం మొదలైంది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ తరపున మెట్‌పల్లి నుంచి పోటీ చేసిన కొమిరెడ్డి రాములు, సమాజ్‌వాది పార్టీ టికెట్‌ మీద గద్వాల నుంచి పోటీ చేసిన  డీకే.అరుణ కాంగ్రెస్‌ రెబల్స్‌గా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించగా, అప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి సీట్లు రాని వారు ఆ పార్టీ తరపున పోటీ చేశారు.

ఆ ఎన్నికల్లో పలువురు పోటీ చేసినప్పటికీ... నిర్మల్‌ నుంచి మహేశ్వర్‌ రెడ్డి, బాల్కొండ నుంచి అనిల్‌కుమార్‌ విజయం సాధించి, అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో విలీనమయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఆదిలాబాద్‌ జిల్లాలో బీఎస్పీని తెరపైకి తెచ్చిన అల్లోల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి, కోనేరు కోనప్ప ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి తర్వాత అధికార పార్టీలో చేరారు.

నర్సంపేటలో కాంగ్రెస్‌ రెబల్‌గా దొంతు మాధవరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో వైరా నుంచి రాములు నాయక్‌ కాంగ్రెస్‌ రెబల్‌గా విజయం సాధించగా, రామగుండం నుంచి కోరుకంటి చందర్‌ ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరపున పోటీ చేసి గెలుపొంది, తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు.

-పోలంపల్లి ఆంజనేయులు

మరిన్ని వార్తలు